వీలు చిక్కితే చాలు కత్తులు దూస్తున్నారు.. చీరాలలో వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు

  • Published By: naveen ,Published On : November 5, 2020 / 03:22 PM IST
వీలు చిక్కితే చాలు కత్తులు దూస్తున్నారు.. చీరాలలో వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు

amanchi krishnamohan vs karanam balaram: ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ గుర్తింపు కాస్త ఓవర్‌ డోస్‌ అయిపోయింది. అధికార వైసీపీలో వర్గాల కుమ్ములాటలు రోజురోజుకు ఎక్కువై రచ్చకెక్కి అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారుతున్నాయి. టీడీపీ తరఫున గెలిచి, వైసీపీకి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యే కరణం బలరాం వర్గానికి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గానికి అస్సలు పొసగడం లేదు. వీలు చిక్కితే చాలు ఇరు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. కరణం, ఆమంచిల మధ్య సయోధ్య కుదర్చడం వైసీపీ పెద్దలకు తలకు మించిన భారంగా మారిపోయిందని అంటున్నారు.

ఆమంచి, కరణం వర్గాల మధ్య తారస్థాయికి ఆధిపత్య పోరు:
ఇప్పటికే వివాదాలతో అగ్గి రాజుకుంటున్న చీరాలతో తాజా వివాదం మరింతగా ఆజ్యం పోసినట్టయ్యిందని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున కరణం బలరాం పోటీ చేయగా, ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆమంచి ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కరణం బలరాం గెలిచినప్పటికీ చాలాకాలం వరకు ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. చీరాలలో ఆమంచి ఓడిపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన వర్గానిదే ఆధిపత్యంలో పైచేయిగా కనిపించింది. కానీ, ఆ తర్వాత కొంత కాలానికి బలరాం వైసీపీకి మద్దతు పలుకుతూ తన కుమారుడు వెంకటేశ్‌ను వైసీపీలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమంచి, కరణం వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది.

రంగంలోకి దిగిన సజ్జల:
అప్పటివరకు ఆమంచి మాటకే అధికారులు విలువ ఇస్తూ వచ్చేవారనే టాక్‌ ఉండేది. కానీ, కరణం కూడా వైసీపీ మద్దతుదారునిగా మారడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఎమ్మెల్యే పొజిషన్‌లో ఉన్న బలరాం మాటను అధికారులు పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఈ మార్పు ఆమంచికి మింగుడు పడకపోయే సరికి ఆయన వర్గీయులు కరణం వర్గంపై మాటల దాడి ప్రారంభించారు. తాజాగా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జరిగిన దాడుల వ్యవహారంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి తన ఇంటికి ఆమంచిని, కరణం వెంకటేశ్‌ను రప్పించుకున్నారు. ఇద్దరితో వేర్వేరుగా మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు.

చీరాలపైనే ఇద్దరూ ఫోకస్:
చీరాల పంచాయితీ సజ్జల దగ్గరకు చేరడంతో పరిస్థితులు చక్కబడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కూడా ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయంటున్నారు. ఆమంచిని పర్చూరు ఇన్‌చార్జిగా వెళ్లాలని పార్టీ పెద్దలు సూచించినా.. ఆయన మాత్రం అందుకు ససేమిరా అన్నారట. తనకంటే కరణం బలరాం అయితేనే పార్టీకి ప్లస్‌ అవుతుందని ఆమంచి అభిప్రాయపడడంతో ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. బలరాం కూడా అద్దంకిని పూర్తిగా వదిలేసి చీరాల మీద దృష్టి సారించడంతో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేని పరిస్థితి నెలకొందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సర్దుకుపోవాలని ఆమంచికి పెద్దల సలహా:
చీరాలలో జరుగుతున్న తతంగంపై పలుమార్లు ఆమంచి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా.. సర్దుకుపోవాలని పార్టీ పెద్దలు సలహాలిచ్చారే తప్ప పూర్తిగా సెట్‌ చేసేందుకు ప్రయత్నించలేదని కార్యకర్తలు అంటున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారి పార్టీకి తలనొప్పిగా మారిందని అభిప్రాయపడుతున్నారు. కరణం, ఆమంచి గట్టి నాయకులు కావడంతో ఎవరినీ నొప్పించలేక వైసీపీ అధిష్టానం సతమతమవుతోందని అంటున్నారు. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వం లోపం ఉన్నందున వీరిద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ, ఇందుకు ఇద్దరూ సిద్ధంగా లేకపోవడంతో అధిష్టానానికి ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు.

భవిష్యత్తులో ఇరువురు కలసి ముందుకు సాగుతారా?
సజ్జల రామకృష్ణారెడ్డితో ఆమంచి, వెంకటేశ్‌ భేటీ అయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నప్పటికీ అదెంత కాలం ఉంటుందో చెప్పలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు అధిష్టానం సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల ఆ ఇద్దరు నేతలకు ఏం చెప్పారు.. వారు అందుకు ఎలా స్పందించారనే అంశాలపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. భవిష్యత్తులో మరి రెండు వర్గాలు కలసి ముందుకు సాగుతాయా? కడుపులో కత్తులు పెట్టుకొని బయటకు మాత్రం స్నేహంగా ఉన్నట్టు ప్రవర్తిస్తారా అన్నది చూడాల్సిందే.