చంద్రబాబుపై సీఐడీ కేసు.. హైకోర్టులో పిటిషన్ విచారణ నేడే

చంద్రబాబుపై సీఐడీ కేసు.. హైకోర్టులో పిటిషన్ విచారణ నేడే

High Court Ap

Amaravati Land Scam Case: అమరావతి అసైన్డ్‌ భూముల కేసు హైకోర్టుకు చేరింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. సీఐడీ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసైన్డ్‌ భూముల కేసులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై నేడు(19 మార్చి 2021) విచారణ జరగనుంది. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చిన సీఐఐ అధికారులు… తన నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేయడం చట్టవిరుద్ధమని నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు.

చంద్రబాబుతో పాటు నారాయణకు సీఐడీ ఇచ్చిన నోటీసులను కక్ష్యపూరితంగా టీడీపీ భావిస్తోంది. బాధితులు, లాభం పొందినవారు కాకుండా ఎమ్మెల్యే ఫిర్యాదుచేస్తే కేసు ఎలా నమోదుచేస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జీవోపై దర్యాప్తు చేసే అధికారం సీఐడీకి లేదని చెబుతున్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల తనిఖీ పూర్తైన తర్వాతే రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూముల పరిహార జీవో జారీ అయ్యిందని.. దానిని మంత్రివర్గం కూడా ఆమోదించిందని వాదిస్తున్నారు.

మంత్రివర్గం ఆమోదించింది కాబట్టి… సీఐడీ ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని న్యాయనిపుణులు సూచించడంతో చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సీఐడీ నోటీసులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును టార్గెట్‌ చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకెళ్తోందంటూ అధికారపక్ష నేతలు అంటున్నారు.

అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాల్లో దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా ఫిర్యాదుచేయవచ్చని ఆళ్ల అన్నారు. తాను దళిత వ్యక్తిని కాకపోతే ఫిర్యాదు చేయకూడదు అని రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు. సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరై స్టేట్‌మెంట్‌ ఇచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్‌ చేశారు.

రాజధాని అమరావతి భూసేకరణలో అక్రమాలు జరిగాయని, ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, ఎస్సీ, ఎస్టీ భూములను టీడీపీ నేతలు బలవంతంగా తక్కువ ధరకు లాక్కుని, దళితులకు తీవ్ర అన్యాయం చేశారని ఆళ్ల ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీకి పూర్తి ఆధారాలు సమర్పించానన్నారు మంగళగిరి ఎమ్మెల్యే.

ఈనెల 23న చంద్రబాబు, ఈ నెల 22న నారాయణ …విజయవాడలోని ఆఫీసుకు రావాలని సీఐడీ నోటీసుల్లో ప్రస్తావించింది. లేకపోతే అరెస్ట్‌ చేసే అధికారం ఉందని ప్రస్తావించింది. ఆ నోటీసులను సవాల్‌ చేస్తూ, ఎఫ్‌ఐఆర్‌ రద్దు కోరుతూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేయడంతో.. న్యాయస్థానం ఏం తీర్పు చెబుతోందనే ఉత్కంఠ నెలకొంది.