Ambati Rambabu : చంద్రబాబు భార్యను ఏమీ అనలేదు.. సింపతీ కోసమే వెక్కి వెక్కి ఏడ్చారు

అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు తన భార్య భువనేశ్వరి పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు, ప్రెస్ మీట్ లో ఆయన వెక్కి వెక్కి ఏడ్చిన అంశాలు..

Ambati Rambabu : చంద్రబాబు భార్యను ఏమీ అనలేదు.. సింపతీ కోసమే వెక్కి వెక్కి ఏడ్చారు

Ambati Rambabu

Ambati Rambabu : అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు తన భార్య భువనేశ్వరి పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు, ప్రెస్ మీట్ లో ఆయన వెక్కి వెక్కి ఏడ్చిన అంశాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.

చంద్రబాబు భార్య భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. భార్య పేరుతో చంద్రబాబు సింపతీ పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను గానీ, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ భువనేశ్వరిని పల్లెత్తు మాన అనలేదన్నారు. భువనేశ్వరిని ఏమైనా అని ఉంటే, తప్పుగా మాట్లాడి ఉంటే చూపించాలని చంద్రబాబుకి సవాల్ విసిరారు రాంబాబు. చంద్రబాబుది జిత్తులమారి స్వభావం అని ఆయన మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో కూడా గెలవలేని దుస్థితి టీడీపీకి వచ్చిందన్నారు. అయినా మా మీద గుడ్డకాల్చి ముఖాన వేసే ధోరణి కనిపిస్తోందన్నారు.

Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

“భువనేశ్వరి గారికి నమస్కరించి చెబుతున్నాం… అమ్మా, మిమ్మల్ని మేం ఏమీ అనలేదమ్మా. మాది మహిళలను కించపరిచే స్వభావం కూడా కాదు. చంద్రబాబు మీ నాన్న గారిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, మీ నాన్న గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. పార్టీని ప్రజలు తిరస్కరించారు కనుక ఇవాళ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని, రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు” అని అంబటి అన్నారు.

”కుప్పం మున్సిపాలిటీ సహా అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా సీఎం జగన్ వైపే ఉన్నారు. సభలో టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సొంతంగా ఎప్పుడూ సీఎం కాలేదు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు” అని అంబటి అన్నారు.

రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్ధమైందని, రాజకీయంగా తెలివిగలవాడు కాబట్టే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసి చంద్రబాబు భార్య పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు పదవే సర్వస్వం అన్నారు. ఎన్టీఆర్‌ను, తోడల్లుడిని, బావ మరదులను పక్కన నెట్టారని చెప్పారు.

ఇవాళ సభలో జరిగింది దురదృష్ట సంఘటన అనాలో… ప్రజలకు అదృష్టం అనాలో ప్రజలే నిర్ణయించాలని రాంబాబు అన్నారు. అసెంబ్లీకి మళ్లీ రాను అని శపథం చేసి చంద్రబాబు వెళ్లిపోయారు.. ఆయన ఎందుకు వెళ్లారో మాకు ఎవరికీ అర్థం కాలేదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఏడ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించిందని రాంబాబు అన్నారు.

Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

కాగా, ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని… మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. వెక్కివెక్కి ఏడ్చారు. దాదాపు రెండు నిమిషాల సేపు మాట్లాడలేకపోయారు. గత రెండున్నరేళ్లుగా తనను వ్యక్తిగతంగా వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెను కూడా చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు వాపోయారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని అన్నారు. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు.