అమ్మఒడి డబ్బులు కావాలా ? ల్యాప్ టాప్ కావాలా ? ఛాయిస్ మీదే – సీఎం జగన్

అమ్మఒడి డబ్బులు కావాలా ? ల్యాప్ టాప్ కావాలా ? ఛాయిస్ మీదే – సీఎం జగన్

Amma Vodi Scheme : ఏపీలో చదువుతున్న విద్యార్థులపై మరో వరం కురిపించారు సీఎం జగన్. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15,000 సాయం అందించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2021, జనవరి 11వ తేదీ సోమవారం నెల్లూరు జిల్లాలో ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

9వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థికి ల్యాప్ టాప్ అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే డబ్బు కావాలంటే..తీసుకోవచ్చని లేదా..ల్యాప్ టాప్ కావాలో ఎంచుకోనే ఆప్షన్ తల్లిదండ్రులకు ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి దీనికి ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే ల్యాప్ టాప్ బయటి మార్కెట్ లో రూ. 25 వేల నుంచి 27 వేల రూపాయలకు దొరుకుతుందని, కానీ తమ ప్రభుత్వం రూ. 18 వేల 500కు ల్యాప్ టాప్ అందిస్తామన్నారు.

వివిధ ప్రసిద్ధ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపిందనే విషయాన్ని తెలియచేశారు. దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తామని, రివర్స్ టెండరింగ్ కూడా చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే కంప్యూటర్ లో 4 గిగా బైట్ ర్యామ్, 500 గిగా బైట్స్ స్టోరేజీ, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 365 స్టూడెంట్ వర్షన్, ఇతర సౌకర్యాలు ఉంటాయన్నారు. మూడేళ్ల పాటు వారంటీ కూడా ఉంటుందన్నారు. ఒకవేళ ల్యాప్ టాప్ చెడిపోతే..ఏడు రోజుల్లోనే రిపేర్ లేదా..రీ ప్లేస్ చేసే విధంగా కంపెనీ వారితో ఒప్పందాలు చేసుకుంటామన్నారు. వసతి దీవెన పథకం తీసుకొనే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు.

కరోనా కారణంగా వివిధ స్కూళ్లు ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాయని, కానీ..కొంతమంది దీనికి దూరంగా ఉన్నారని తెలిపారు. అందుకే ప్రభుత్వం ల్యాప్ టాప్ అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 8వ తరగతి నుంచే కంప్యూటర్ లిటరసీ కోర్సు ప్రవేశపెడుతామన్నారు. డబ్బున్న వారి పిల్లలకు పోటీగా చదువుకొనే విధంగా తయారు చేస్తామని, వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్ సౌకర్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు, అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం చేసేందుకు రూ. 5 వేల 900 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారన్నారు.