Anandaiah Medicine: జగన్, కాకాణి ఫోటోలతో.. ప్రత్యేక పాకెట్లలో ఆనందయ్య మందు

కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తర్వాత ఎట్టకేలకు పంపిణీ మొదలెట్టారు. ఇవాళ(07 జూన్ 2021) నుంచి మందు పంపిణీ చేస్తున్నారు.

Anandaiah Medicine: జగన్, కాకాణి ఫోటోలతో.. ప్రత్యేక పాకెట్లలో ఆనందయ్య మందు

Anandaiah Medicine

Anandaiah Medicine in Special pockets: కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తర్వాత ఎట్టకేలకు పంపిణీ మొదలెట్టారు. ఇవాళ(07 జూన్ 2021) నుంచి మందు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆనందయ్య మందు ఒక్కసారిగా పాపులర్‌ అవ్వగా.. మందు బాగా పనిచేస్తుందని పలువురు విశ్వసించడం, ఆ నోటా ఈ నోటా ప్రచారం సాగడంతో కృష్ణపట్నం వెళ్లేవారి సంఖ్య పెరిగింది.

భౌతికదూరం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసరికి రచ్చ జరగడంతో.. పసరు మందులో పసరెంతో నివేదిక ఇవ్వాలని లోకాయుక్త కోరడం చివరకు మందు పంపిణీకి బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం.. మందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే సర్వేపల్లిలోని లక్ష ఎనిమిది వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

మందు పంపిణీ కోసం.. జగన్, ఆనందయ్య, కాకాణి బొమ్మలతో తయారు చేసిన ప్రత్యేకమైన ప్యాకెట్లను చేసి మందు పంపిణీ చేస్తున్నారు. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి క్షేత్రం గొలగముడిలోని మినీ కల్యాణ మంటపంలో ఎమ్మెల్యే కాకాణి చేతుల మీదుగా మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ సంధర్భంగా మాట్లాడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఆనందయ్య మందును వాలంటీర్ల ద్వారా కుటుంబాలకు ఇస్తామని మందు పంపిణీని కొంతమంది రాజకీయం చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు కాకాణి. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని, ఆనందయ్య మందుపై నేను అవినీతికి పాల్పడి ఉంటే నా కుటుంబం నాశనం అవుతుందన్నారు కాకాణి. సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు.

గత నెల 16న అంటే మే16న కృష్ణపట్నంకు పెద్ద సంఖ్యలో కోవిడ్‌ బాధితులు, వారి బంధువులు వెళ్లారు. ఆనందయ్య మందు కోసం బారులు తీరారు. ఈక్రమంలో లోకాయుక్త రంగంలోకి దిగి ఆదేశించడంతో.. మే 17న నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు.. జిల్లా వైద్యాధికారి, డీపీవో, ఆయుష్‌ డాక్టర్లు, ఆర్డీవోతో విచారణ కమిటీని ఏర్పాటుచేశారు.

మే 18న తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి జనం కృష్ణపట్నం చేరుకున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటించే పరిస్థితి లేకపోవడంతో మందు పంపిణీని ఆపేశారు అధికారులు. 19,20 తేదీల్లోనూ మందు పంపిణీ జరగలేదు. 21న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి చేతులమీదుగా పంపిణీ పునఃప్రారంభమైంది.

ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ప్రజలు వేలాదిగా కృష్ణపట్నం చేరుకోవడంతో వారందర్నీ కంట్రోల్‌ చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో మందు పంపిణీకి మళ్లీ బ్రేక్ పడింది. సరిగ్గా 17రోజుల తర్వాత ఇప్పుడు మందు పంపిణీ తిరిగి ప్రారంభం అయ్యింది.