ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి దింపే యత్నం : మహిళపై కేసు నమోదు

  • Published By: murthy ,Published On : May 28, 2020 / 05:33 AM IST
ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి దింపే యత్నం : మహిళపై కేసు నమోదు

ఉద్యోగం పేరుతో యువతిని వ్యభిచార కూపంలోకి దింపేందుకు యత్నించిన మహిళ ఉదంతం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అనంతపురం రూరల్  పరిధిలో పద్మావతి  అలియాస్ దస్తగిరమ్మ అనే మహిళ నివసిస్తోంది. తన ఇంటికి సమీపంలోని ఉండే ఒక యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో  ఉండటం ఆమె గమనించింది. ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకుంది.

ప్రొద్దుటూరులో తనకు తెలిసిన వారు ఉన్నారని, అక్కడికొస్తే వారిద్వారా మంచి ఉద్యోగం వేయిస్తానని, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పింది. ఆమె  మాటలు నమ్మిన యువతి, రెండు నెలల క్రితం  ఇంట్లో ఎవరికీ చెప్పకుండా  పద్మావతి  వెంట  ప్రొద్దుటూరు వెళ్లింది. విషయం తెలియని కుటుంబ సభ్యులు తమ కుమార్తె కనిపించటంలేదని అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఉద్యోగం ఇప్పిస్తానని ప్రొద్దుటూరు తీసుకు వెళ్లాక పద్మావతి మాట మార్చింది. వ్యభిచారం చేసుకుంటే కావాల్సినంత సంపాదన వస్తుందని ఆశ చూపింది. తాను అలాంటి పని చేయనని ఆ యువతి చెప్పినా…. ఆమెను నిర్భదించి ఎలాగైనా వ్యభిచార రొంపిలోకి దింపేదుకు ప్రయత్నించింది పద్మావతి.

ఒకరోజు ఎవరూ చూడకుండా  ఆ యువతి తనను బంధించిన ఇంటినుంచి పారిపోయి బయట పడింది. కాకపోతే అప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావటంతో ప్రొద్దుటూరులో చిక్కుకుపోయింది.  యువతి ఆచూకి తెలుసుకున్న త్రీటౌన్ సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో యువతిని అనంతపురం తీసుకువచ్చారు. పద్మావతి పై  ఉమెన్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశారు. 

Read: అందంగా కనిపించకూడదని భార్య జట్టు కత్తిరించిన భర్త, లాక్ డౌన్ లో పెరిగిన గృహహింస కేసులు