అమరావతి భూ అక్రమాలపై చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

అమరావతి భూ అక్రమాలపై చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

Cbn

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబుకు రాజధాని అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు.. నోటీసులు అందజేశారు. 41సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లుగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.

విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లోఉందని, అమరావతిలో అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. చంద్రబాబు తన అనుచరులకు, సన్నిహితులకు లబ్ది పొందేలా చేశారనే ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చినట్లు చెబుతోంది.

చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించిన సీఐడీ అధికారులు.. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదు అంటూ గతంలో హైకోర్టు వ్యాఖ్యలు చెయ్యగా.. ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.