CM Jagan: ఢిల్లీలో బిజీబిజీగా జగన్.. నిధులు కోసం విన్నపాలు

రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్‌ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో భేటీకానున్నారు జగన్.

CM Jagan: ఢిల్లీలో బిజీబిజీగా జగన్.. నిధులు కోసం విన్నపాలు

Cm Jagan Delhi

CM Jagan’s Delhi Tour: రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్‌ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో భేటీకానున్నారు జగన్. ఇప్పటికే అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జగన్.. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ నిధులు, మూడు రాజధానుల అంశాలపై చర్చించబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో సీఎం జగన్ మొదటి రోజు బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గంటా 35 నిమిషాల పాటు చర్చలు జరిపారు ఏపీ సీఎం జగన్. ఏపీ మూడు రాజధానుల అంశం వివరించారు. ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్నికూడా తీసుకొచ్చామని అమిత్ షాకు తెలిపారు సీఎం. కర్నూలుకు హైకోర్టును మారుస్తూ రీ-నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని బీజేపీ కూడా పెట్టిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల అనుమతులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన వైద్యసేవలను అందించడానికి ప్రభుత్వం చర్యలను ప్రారంభించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 కాలేజీలకు అనుమతి ఇచ్చిందని, మిగిలిన వాటికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరారు.

రాష్ట్రంలో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3 వేల 2 వందల 29 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 4 వేల 6 వందల 52 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉందని తెలిపారు. అలాగే సంవత్సరంలో పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు సీఎం జగన్. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రావాల్సిన రూ.529.95 కోట్ల బకాయిలు, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.497 కోట్లు కూడా పెండింగులో ఉన్నాయని, నిధులు విడుదలయ్యేలా చూడాలని అమిత్ షాను కోరారు ఏపీ సీఎం.

విద్యుత్ రంగానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరారు. కుడిగి, వల్లూరు థర్మల్‌ ప్లాంట్ల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను సరెండర్‌ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంల నుంచి రూ.5,541.78 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ద్వారా తెలంగాణ డిస్కంలకు తగిన రుణ సదుపాయాలను కల్పించి, తద్వారా ఏపీ జెన్‌కోకు సెంట్రల్‌ డివల్యూషన్‌ నుంచి ఆ డబ్బు వచ్చేలా చూడాలన్నారు. రూ. 50 వేల కోట్ల అప్పులను రీ స్ట్రక్చర్‌ చేయాలని అమిత్‌ షాను విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి.

విశాఖ జిల్లా అప్పర్‌ సీలేరులో రివర్స్‌ పంప్‌ స్టోరేజీ విద్యుత్‌ పాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు సీఎం జగన్. 13 వందల 50 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ఈ ప్రాజెక్టుకు 10 వేల 4 వందల 45 కోట్ల ఖర్చు అవుతుందని అమిత్ షాకు వివరించారు. కేంద్రం 30శాతం నిధులను సమకూర్చాలని, పర్యావరణ అనుమతులు వచ్చేలా చూడాలని విజ్ఙప్తి చేశారు.

దిశ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు 2020కి ఆమోదం తెలపాలని కేంద్ర హోంమంత్రిని కోరారు సీఎం జగన్. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని వెంటనే యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఙప్తి చేశారు.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో జగన్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాల ప్రకారం నిధుల కేటాయింపు చేయాలన్నారు. 2017-18 ధరల ప్రకారం 55,656.87కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు.. భూసేకరణ, పునరావాస పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందువెళ్తున్నామన్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం తరలించాలని విన్నవించారు జగన్‌. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు… 2022లో ఖరీఫ్‌ సీజన్‌ నాటికి పోలవరం నుంచి నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని… ఈ ప్రాజెక్టు నిధుల విడుదలకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ను కలిశారు ఏపీ సీఎం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కోరారు.

అంతకుముందు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని.. వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.