All The Best : గ్రామ, సచివాలయాల పరీక్షలు ప్రారంభం, రెండు సెషన్లు

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 10:01 AM IST
All The Best : గ్రామ, సచివాలయాల పరీక్షలు ప్రారంభం, రెండు సెషన్లు

 Andhra Pradesh Grama/Ward Sachivalayam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 16 వేల 208 పోస్టుల భర్తీకి 14 రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లక్షణాలున్న అభ్యర్థులకు ప్రత్యేక గది ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే.. పరీక్ష మొదలయ్యాక నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు.



ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలకు రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్న రాత పరీక్షలను కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఖాళీగా ఉన్న 16వేల 208 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 10లక్షల 56వేల 391 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 14 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

సచివాలయాల ఉద్యోగాల పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా.. రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కానుంది. అయితే అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.



కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతిస్తారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి, కోవిడ్ బాధితులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఐసొలేషన్ రూంలో పరీక్షలు నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు అందజేస్తారు.

అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, హాండ్ శానిటైజర్లతో పరీక్షకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది.



అభ్యర్థుల హాల్‌ టిక్కెట్‌లో ఏమైనా లోపాలుంటే.. గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించుకున్న మూడు ఫోటోలను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును కూడా అభ్యర్థులు వెంట తీసుకెళ్లాలి. దివ్యాంగులు మరొకరితో పరీక్ష రాయించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.



రానున్న రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది.