ఏపీలో కరోనా తగ్గుతోంది.. 24 గంటల్లో 10,845 మంది డిశ్చార్జ్

  • Published By: sreehari ,Published On : September 16, 2020 / 07:20 PM IST
ఏపీలో కరోనా తగ్గుతోంది.. 24 గంటల్లో 10,845 మంది డిశ్చార్జ్

AP Covid Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోయిన కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో రోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.



వీరిలో 8,835 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 64 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి 10,845 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువ అయింది.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 5,92,760కు చేరింది.

ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,97,376కి చేరినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకూ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 48,06,879 కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా 64మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 90,279 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మృతిచెందారు.