Andhra pradesh: ఏపీలో ముఖ్యమైన వార్తలు, నేతల పర్యటనల వివరాలు ..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు.

Andhra pradesh: ఏపీలో ముఖ్యమైన వార్తలు, నేతల పర్యటనల వివరాలు ..

AP NEWS

Andhra pradesh: మాజీ సీఎం, టీడీపీ అధినేత నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు ధర్నాలు నిర్వహించనున్నారు. ఇలా.. ఈ రోజు రాష్ట్రంలో నేతల పర్యటనలు, ముఖ్యమైన వార్తల వివరాలు తెలుసుకుందాం.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం 67,828 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.14 కోట్లుగా నమోదైంది. సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్‌లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.

19న ఆప్షనల్ సెలవు..

షబ్-ఎ-ఖదర్ పర్వదినం సందర్భంగా ఈనెల 19వ తేదీన ఆప్షనల్ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల జాబితాలో ఏప్రిల్ 18(ఇవాళ) ఆప్షనల్ సెలవుగా ఉండగా.. దానికి బదులుగా ఈ నెల 19వ తేదీని సెలవుగా పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంప్‌లు ..

ఏపీలో ఆధార్ కార్డు ఉన్న వారికి శుభవార్త. రాష్ట్రంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంప్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈనెల 18, 19, 20, 26, 27 తేదీల్లో ఈ క్యాంప్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సచివాలయాల శాఖ, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ తీసుకున్న తర్వాత పదేళ్లయినా ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోని వారు రాష్ట్రంలో 1.53 కోట్ల మంది ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

25వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ..

ఆంధ్రా వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే AUEET పరీక్ష దరఖాస్తుకు ఈనెల 25 వరకు గడువు ఉంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన వారు, ఇంటర్ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 3న విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప కేంద్రాల్లో పరీక్ష నిర్వహించి, మే 5న ఫలితాలు వెల్లస్తారు.

కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన ..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ కడపలో జోన్-5 సమావేశం నిర్వహించనున్నారు. కడప, ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలోని ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. బుధవారం ఉదయం బద్వేలు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం ప్రకాశం జిల్లా పర్యటనకు వెళతారు. చంద్రబాబు కడప పర్యటనలో భాగంగా.. సాయంత్రం 6గంటలకు అమీన్ పీర్‌దర్గా‌లో ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి కి బద్వేలు చేరుకొని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం బద్వేలు నుండి ప్రకాశం జిల్లా పర్యటనకు చంద్రబాబు వెళ్తారు.

కలెక్టరేట్ల వద్ద ధర్నాలు..

ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గోనున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేపడుతున్నారు.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కొణతనపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. జరిగింది. రాంగ్ రూట్లో వస్తున్న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి..

అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. http://www.aptemples.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అన్నవరం దేవస్థానాన్ని ఎంపిక చేసుకొని ఫోన్ నెంబర్ సహాయంతో లాగిన్ అవ్వాలి. తద్వారా ఆన్‌లైన్ సేవలను పొందవచ్చు. స్వామివారి ప్రత్యక్ష, పరోక్ష సేవలు, అన్నదానం టికెట్లు, వసతి గదులు, దర్శనాలు, ప్రసాదం, కల్యాణకట్ట, కల్యాణ మండపాలు బుకింగ్ ముందుగానే చేసుకోవచ్చు.