అమరులకు అండగా జగన్.. తెలుగు జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

అమరులకు అండగా జగన్.. తెలుగు జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

Andhra Pradesh Ys Jagan Announces Rs 30 Lakh Ex Gratia To Kin Of Deceased In Chhatisgarh Encounter

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, మృతుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉండగా.. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. ఇరు కుటుంబాలకు రూ.30లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.


ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ వీరమరణం చెందగా.. వారి కుటుంబాలకు అండగా ఉంటానని ఇరు కుటుంబాలకు చెరో రూ.30లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు జగన్.

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందగా.. అందులో తెలుగువాళ్లు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ది మక్కువ మండలం కంచేడువలస గ్రామం. రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2010లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. జగదీష్‌కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావలసి ఉంది. ఇటువంటి సమయంలో జగదీష్ మరణవార్త కుటుంబాన్ని కలచివేస్తుంది.

చనిపోయిన వీర జవాన్లలో మరో వ్యక్తి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణ.. మురళీకృష్ణ 2010లో సీఆర్‌పీఎఫ్‌లో జాయిన్ అవ్వగా.. ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకున్నారు. త్వరలో పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇంతలోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయారు.