జగన్ కు జై కొడతారా : జనసేన ఏకైక ఎమ్మెల్యేకి బుద్ధి చెబుతారట

అధినేత రెండు చోట్ల ఓడిపోయినా ఆయన ఒక్కడు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాడు. కొద్ది కాలం పార్టీ అజెండానే మోశాడు. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది. అధికార పార్టీకి ఆయన

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 04:05 PM IST
జగన్ కు జై కొడతారా : జనసేన ఏకైక ఎమ్మెల్యేకి బుద్ధి చెబుతారట

అధినేత రెండు చోట్ల ఓడిపోయినా ఆయన ఒక్కడు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాడు. కొద్ది కాలం పార్టీ అజెండానే మోశాడు. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది. అధికార పార్టీకి ఆయన

అధినేత రెండు చోట్ల ఓడిపోయినా ఆయన ఒక్కడు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాడు. కొద్ది కాలం పార్టీ అజెండానే మోశాడు. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది. అధికార పార్టీకి ఆయన దగ్గరయ్యారు. అధినేత ఢిల్లీలోని అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ దగ్గరవుతున్న ఆ ఏకైక ఎమ్మెల్యేకు స్థానికులు బుద్ధి చెప్పాలని డిసైడ్‌ అయ్యారట. అధినేత మాట కోసం ఇంత కాలం ఎదురు చూసిన ఆ సైనికులు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. 

వైసీపీలో చేరితే 152వ స్థానం.. జనసేనలో ఉంటే నెంబర్‌ 1‌:
జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. 2019 ఎన్నికల తర్వాత ఏపీ ప్రజల నోళ్లలో ఈ పేరు నానుతోంది. పార్టీ తరఫున ఒక్కరే గెలవడంతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో సమానంగా క్రేజ్‌ను సంపాదించుకున్నారు రాపాక. దీంతో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జనసైనికులు ఘన స్వాగతం పలుకుతుంటారు. ఒక ఎమ్మెల్యేకు ఇంత ఫాలోయింగా అని ఆశ్చర్యపోయేంత హడావుడి చేస్తారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 151 మంది ఒకవైపు.. రాపాక ఒక్కడే ఒకవైపు అంటూ అధికార పార్టీ సోషల్ మీడియాను ఆటాడుకుంటుంటారు. ఇంతలోనే ఏ క్షణంలోనైనా రాపాక అధికార వైసీపీలో చేరడం ఖాయమంటూ గెలిచిన వారానికే వార్తలు మొదలయ్యాయి. అయితే వైసీపీలో చేరితే తన స్థానం 152 అని, అదే జనసేనలో ఉంటే నెంబర్ వన్‌ అని చెప్పి ఆ వార్తలకు బ్రేకులు వేశారు.

జనసేనను ఇరుకున పెట్టేలా రాపాక తీరు:
గత రెండు అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధికార పార్టీకి దగ్గరగా ఉంటున్నారు. ఇసుక కొరత విషయంలో జనసేన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్ తర్వాత ఎమ్మెల్యే పూర్తిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనకు మద్దతు పలికారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై జనసేన పార్టీ వ్యతిరేకం కానప్పటికీ తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో జనసేన పార్టీని ఇరుకున పెట్టేలా అసెంబ్లీలో రాపాక మాట్లాడిన తీరు అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పుడు శాసన మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.

వైసీపీలోకి రాపాక:
రాపాక తీరు చూస్తుంటే వైసీపీ పక్షంలో పూర్తిగా చేరిపోయినట్టేనని అధికార పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశాన్ని కూడా ఎమ్మెల్యే రాపాక స్వాగతించారు. మూడు రాజధానుల అంశానికి జనసేన పార్టీ పూర్తి వ్యతిరేకమైనా రాపాక మాత్రం అనుకూలంగా వ్యవహరించారు. దీంతో రాపాక వైసీపీలో చేరడం ఖాయమని మరోసారి ప్రచారం జోరందుకుంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాపాక పనిచేస్తున్నా జనసేన అధినేత నుంచి కింది స్థాయి జనసైనికుల వరకు ఆయనపై విమర్శలు చేయలేదు. వైసీపీ అధిష్టానం సూచనల మేరకు రాపాక నడుస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. 

జనసేన ఎందుకు నచ్చడం లేదో చెప్పాలి:
బీజేపీ-జనసేన పొత్తు తర్వాత రాపాక పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాపాకపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్‌ చెప్పడంతో రాజోలు జనసైనికుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందట. అప్పటి నుంచే రాజోలులో జనసేన నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు ప్రారంభించారని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా రాపాకను ప్రశ్నించడంతో పాటు ఇటీవల నియోజకవర్గంలో ఉన్న జనసేన బ్యానర్లలో రాపాక ఫొటోలను మాత్రం చెరిపేశారు. కొన్ని గ్రామాల్లో అయితే మహిళలు సైతం రాపాకకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరిన రాపాకకు ఇప్పుడు ఏం నచ్చడం లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ను చూసి ఓటేశాం తప్ప.. రాపాకను చూసి కాదని బల్లగుద్దుతున్నారు. 

2014 ఎన్నికల్లో ఓట్ల లెక్కను బయటకు తీస్తున్న జనసైనికులు:
జనసేన టికెట్‌ ఇచ్చినా తనకున్న బలంతో గెలిచానని గతంలో చెప్పిన మాటలు చూసి 2014 ఎన్నికల్లో రాపాకకు వచ్చిన ఓట్ల లెక్కను బయటకు తీస్తున్నారట. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాపాకకు కేవలం 318 ఓట్లు వచ్చాయి. దీంతో  ఓట్ల జాబితాను సోషల్ మీడియాలో పెట్టి ఇదేనా నీ బలం అంటూ రాపాకను ఒక ఆటాడుకుంటున్నారు. ఇటీవల శాసనమండలి రద్దుపై కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో నియోజకవర్గంలో అడుగుపెడితే ఎలా ఉంటుందో అని ఉత్కంఠ కొనసాగుతోంది. జనసేన పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక రాజోలు ప్రజలే జనసేన ఎమ్మెల్యేను శిక్షిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.