గ్రామాలకు పాకుతున్న వింత వ్యాధి, వణుకుతున్న జనాలు

గ్రామాలకు పాకుతున్న వింత వ్యాధి, వణుకుతున్న జనాలు

Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస్తోంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత ఏడుగురు అస్వస్థతకు గురికాగా.., రెండు రోజుల్లో ఆ సంఖ్య 31కి చేరింది. ఫిట్స్, వాంతులు, నీరసంతో జనం కళ్లుతిరిగి పడిపోతున్నారు. కొంతమందిలో డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఆస్పత్రి పాలైన వారిలో 22 మంది పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డిశ్చార్జ్ అయిన వారిలో ఇద్దరు వ్యక్తులు మూడుసార్లు మూర్చవచ్చి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరులో వ్యాపించిన అంతుచిక్కని వ్యాధి తరహాలోనే పూళ్ల బాధితుల లక్షణాలుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 5 ప్రత్యేక వైద్య బృందాలతో గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

అలాగే బాధితులకు మెరుగైన వైద్యమందించేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించారు. మరో 12 మంది డాక్టర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా ఆస్పత్రిలో వంద పడకలు సిద్ధం చేశారు. బాధితులను డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. వ్యాధిపై ఎవరూ ఆందోళన చెందవద్దని.., ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అలాగే బాధితులకు మెగురైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని.., ఎమర్జెన్సీ అంబులెన్సులు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు.