AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో దాడుల పర్వం.. ట్రెండింగ్ లో ఆ రెండు హాష్ ట్యాగ్స్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన దాడుల పర్వంపై అధికార, ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా వాదోపవాదనలకు దిగాయి.

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో దాడుల పర్వం.. ట్రెండింగ్ లో ఆ రెండు హాష్ ట్యాగ్స్

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేశాయి. అధికార, విపక్ష సభ్యుల గలాటా, వాదోపవాదనలు నడుమ సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. తప్పు మీదంటే మీదని ఇరుపక్షాలు వాదించుకోవడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడ్డారని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. వామపక్షాలు, జనసేన పార్టీ కూడా శాసనసభలో జరిగిన పరిణామాలపై స్పందించడంతో రాజకీయ వేడి కొనసాగింది.

సోషల్ వార్..
ఏపీ అసెంబ్లీలో దాడుల పర్వంపై సోషల్ మీడియాలోనూ అధికార, విపక్షాలు ఆరోపణలను హోరెత్తించాయి. ఫొటోలు, వీడియోలు, కామెంట్లు పోస్ట్ చేశాయి. టీడీపీ #TDPDalitMLAattackedInAssembly హాష్ ట్యాగ్ తో ట్విటర్ లో తమ వాదనలు వెల్లడించింది. వైసీపీ #TDPRowdiesInAssembly హాష్ ట్యాగ్ తో తమ వెర్షన్ వినిపించింది. దీంతో ఈ రెండు హాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లో నిలిచాయి.

అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు
జీవో 1 రద్దు చేయాలంటూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతుండగా తమ పార్టీకి చెందిన డోలా బాల వీరాంజనేయులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. దళితుడైన వీరాంజనేయులు, వృద్ధుడైన బుచ్చయ్యపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన నాయకులు ప్రకటనలు గుప్పించారు. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా పేర్కొంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు.

Also Read: ‘ఇది శాసనసభ కాదు..కౌరవ సభ ’జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు : చంద్రబాబు ఆగ్రహం

ప్లాన్ ప్రకారమే రెచ్చగొడుతున్నారు
తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై దాడి చేసి టీడీపీ నాటకాలు ఆడుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సుధాకర్ బాబు తన చేతికి గాయమైందని మీడియా ముందుకు వచ్చారు. బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ పై పేపర్లు విసిరేసి టీడీపీ సభ్యులు అవమానించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ రాకుండా తమ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి పంపిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై సభలో చర్చ జరగకుండా చేసేందుకు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అన్నారు. అధికార, విపక్ష సభ్యుల పరప్పర ఆరోపణలతో వరుసగా ఏడో రోజూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మారాయి.