ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..రాజధానిపై కీలక ప్రకటన

  • Published By: madhu ,Published On : January 11, 2020 / 08:55 AM IST
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..రాజధానిపై కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణపై ప్రభుత్వం చర్చించనుంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 2020, జనవరి 20వ తేదీన అసెంబ్లీ సమావేశం జరుగనుంది. GN RAO కమిటీ, BCG నివేదికలపైనా చర్చించనుంది. రాజధానిపై కీలక ప్రకటన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. 

సీఎం జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని రాజధాని ప్రాంత వాసులు తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో GN RAO, BCG కమిటీలు నివేదికలు సమర్పించాయి. పలు సూచనలు చేశాయి. అమరావతే రాజధానిగా ఉంచాలంటూ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించింది. కమిటీలు ఇచ్చిన నివేదికలను, ఇతర అంశాలను సుదీర్ఘంగా అధ్యయనం చేయనుంది. ఇప్పటికే ఓ సమావేశం జరిగింది. మరో సమావేశాన్ని 13వ తేదీన ఉండబోతోంది. 

అయితే..అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు..అంటే సంక్రాంతి పండుగ అనంతరం జనవరి 18వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో హై పవర్ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం 20వ తేదీన జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధాని అంశంపై కీలక ప్రకటన చేయనుంది. సమావేశం కేవలం ఒక్క రోజే ఉంటుందా ? పొడిగిస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. 

Read More : 3 రాజధానుల ఏర్పాటు ఫైనల్.. ఎవరూ ఆపలేరు : మంత్రి బాలినేని