Sunil Deodhar : టీడీపీ, జనసేనతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ

వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవ్ ధర్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

Sunil Deodhar : టీడీపీ, జనసేనతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ

Sunil Deodhar : వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవ్ ధర్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవి చూశామన్నారు. టీడీపీ, వైసీపీలు రెండూ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలే అని విమర్శించారు. పవన్ కల్యాణ్ తో రోడ్ మ్యాప్ అంశంపై రెండు పార్టీలు కలిసి అంతర్గతంగా చర్చించుకుంటామన్నారు.

”వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుంది. టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలను ఎదురు చూశాం. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించాం” అని సునీల్ దేవ్ ధర్ అన్నారు.

ఇక ఏపీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విఫలమయ్యారంటూ ఆ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపైనా దేవ్ ధర్ స్పందించారు. కన్నా వ్యాఖ్యలను తామేమీ అంత సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. పార్టీలో ఈ తరహా అసంతృప్తులు సహజమేనని, అవేమీ అంత పెద్దగా పట్టించుకునే వ్యాఖ్యలు కూడా కాదన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొత్తులపై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం పొత్తులపై క్లారిటీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఇప్పటికే బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుతో కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పొత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ తో భేటీ కావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పవన్ కూడా వైసీపీని గద్దె దించేందుకు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. బీజేపీతో పొత్తుపైనా పవన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు ఉన్నా కలిసి బలంగా పని చేయలేకపోతున్నామన్నారు. రోడ్ మ్యాప్ విషయంలో బీజేపీ వైఖరిపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నుంచి క్లారిటీ రాకపోతే తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీతో పవన్ తెగదెంపులు చేసుకోనున్నారా అనే చర్చ మొదలైంది.

మొత్తంగా.. ఏపీలో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. పవన్ బీజేపీతో కలిసి వెళతారా? లేక టీడీపీతో కలిసి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీని ఓడించాలంటే 2014 ఎన్నికల్లో లానే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇందుకు టీడీపీ, జనసేనలు కొంత సుముఖంగా ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు జరిగిన పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో చివరకు జనసేన టీడీపీతో ఉంటుందా? బీజేపీతో వెళుతుందా? అనేది తేలాల్సి ఉంది.