ఏపీ కేబినెట్ భేటీ…అజెండా ఇదే

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 01:06 AM IST
ఏపీ కేబినెట్ భేటీ…అజెండా ఇదే

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం 2020, మార్చి 04వ తేదీ బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షత భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ చర్చించనుంది. ప్రభుత్వం ఈ నెలలోనే స్థానికసంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంది. సీఎం జగన్‌ సమీక్షా సమావేశంలోనూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  

రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు ఆదేశాలతో లోకల్ ఫైట్‌కు వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.  ఈ నేపథ్యంలో ఈనెల 7న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు  నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది. 10న మున్సిపాలిటీలకు నోటిఫికేషన్‌ వచ్చే చాన్స్‌ ఉంది.

మార్చి 31లోపు 14వ ఆర్థిక సంఘం గడువు పూర్తవుతుంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సుమారు 5వేల కోట్లు అందుతాయి. లేకపోతే వాటిని వదులుకోవాల్సిందే.  దీంతో  ప్రభుత్వం ఈ కష్టమైనా ఈ నెలలోనే లోకల్‌బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణపై ఇవాళ కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుంది.

బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపైనా కేబినెట్‌ చర్చించనుంది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన తరుణంలో అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.  ఎన్నికలు పూర్తయిన తర్వాత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలా… లేక స్థానిక సంస్థల ఎన్నికలకంటే ముందుగానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇదే క్రమంలో ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్‌లో చర్చ జరుగనుంది. పరీక్షల నిర్వహణతో ఎన్నికల సిబ్బందికి కొరత ఏర్పడే అవకాశముంది. ఈ క్రమంలో పదో తరగతి ఇన్విజిలేటర్లుగా గ్రామ సెక్రటేరియట్‌ సిబ్బందిని తీసుకున్నా… స్కూళ్లను పోలింగ్‌ బూతులుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితులపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

ఇక ఏపీలో కూడా ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లిం మైనార్టీలు , ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై అభద్రతా భావం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని రాష్ట్రంలో అమలు చేయకూడదని కోరారు. ఈ క్రమంలో ముస్లిం మైనార్టీల మనోభావాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించదని ఇప్పటికే పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్‌ ద్వారా జగన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్‌పీఆర్‌ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌లోనూ ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించనున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పైనా కేబినెట్‌ చర్చించనుంది. ఏపీలో కరోనా వైరస్‌ ప్రవేశించకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఇక ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న క్రమంలో భూ సేకరణ.. భూ సమీకరణ పై జరిగిన పురోగతిపైనా మంత్రిమండలి చర్చించనుంది. 

Read More : కరోనా కలకలం : షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు – మంత్రి ఈటెల