ఏపీ కేబినెట్‌ భేటీ, ఇసుక పాలసీలో మార్పులపై కీలక చర్చ

  • Published By: naveen ,Published On : November 5, 2020 / 11:45 AM IST
ఏపీ కేబినెట్‌ భేటీ, ఇసుక పాలసీలో మార్పులపై కీలక చర్చ

ap cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. గురువారం(నవంబర్ 5,2020) అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయ్యింది. ప్రధానంగా ఇసుక పాలసీలో మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. దాదాపు 30 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అసెంబ్లీ  సమావేశాలు, ఆమోదించాల్సిన బిల్లులతో పాటు ఇసుక పాలసీలో మార్పులపైనా ప్రధానంగా చర్చిస్తున్నారు. కేబినెట్ భేటీలో మచిలీపట్నం పోర్టు డీపీఆర్ కు ఆమోదం లభించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ బడుగు వికాసం, దిశ బిల్లు సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే చాన్స్ ఉంది.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీపై సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. అయితే ఈ పాలసీతో ప్రభుత్వానికి మంచి జరగకపోగా.. తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు ఇసుక పాలసీని సరిదిద్దేందుకు సిద్దం అవుతున్నారు.

త్వరలోనే ఇసుక పాలసీని మార్చి, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. వినియోగదారునికి ఇబ్బందిగా ఉన్న నిబంధనలను మార్చి, అనుకూలమైన విధానాన్ని రూపొందించే పనిలో సంబంధిత అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ విధానం ద్వారా జరిగే నష్టాన్ని, ప్రభుత్వానికి వచ్చిన అపప్రదను తొలగించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నెల్లూరు జిల్లాలో ఇసుకకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో పెన్నా నదికి వరద పోటెత్తడంతో ఇసుక రీచ్‌లన్ని మూసేశారు.. ఈ క్రమంలో కేవలం వెంకటమలంలో ఉన్న ఇసుక స్టాక్‌ పాయింట్‌ మీదే ప్రజలు ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఇక్కడ కూడా ఇసుక దొరకడం కష్టంగా మారింది. దీంతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. మరోవైపు పెరిగిన ఇసుక రేట్లు కూడా గుదిబండగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఇసుక బుక్‌ చేసుకోవడం కూడా మరో పెద్ద సమస్య అంటున్నారు బిల్డర్‌లు.