ఏపీ కేబినెట్ భేటీ : కీలక అంశాలపై చర్చ, పోలవరం వద్ద వైఎస్ఆర్ విగ్రహం!

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 06:37 AM IST
ఏపీ కేబినెట్ భేటీ : కీలక అంశాలపై చర్చ, పోలవరం వద్ద వైఎస్ఆర్ విగ్రహం!

AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ సమక్షంలో క్యాంప్‌ ఆఫీస్‌లో మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌ చర్చించనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 30 నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్‌ కూడా విడుదలయ్యాయి. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. నేటి మంత్రివర్గ సమావేశంలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు.. సభలో ఏం చర్చించాలన్న దానిపైనా కేబినెట్‌లో చర్చిస్తారు.



స్థానిక సంస్థల ఎన్నికలు : 
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా కేబినెట్‌ చర్చించే అవకాశముంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం, హైకోర్టులో కేసు విచారణపై మంత్రివర్గం చర్చించనుంది. హైకోర్టులో ప్రభుత్వం వేసిన కేసులపై జరుగుతున్న విచారణలు, సుప్రీంకోర్టులో అనుకూలంగా వచ్చిన తీర్పులపై సీఎం జగన్‌ సహచర మంత్రులకు వివరించనున్నారు. ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.



https://10tv.in/the-ap-government-issued-orders-for-the-early-release-of-life-sentences-women-prisoners/
నివార్ తుఫాన్ : 
నివార్‌ తుఫాను, వరద నష్టంపైనా కేబినెట్‌ చర్చించనుంది. రాష్ట్రంలో నివార్‌ తుపాను కారణంగా జరిగిన నష్టం, వరదలు, తక్షణం అందించే సాయంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇటీవల వరదలతో నష్టపోయిన రైతులపై నివార్‌ సైక్లోన్‌ కూడా దాడి చేయడంతో…. అన్నదాతలు మరింత నష్టపోయారు. ప్రజలు కూడా తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లు వరదల ధాటికి ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో వరదనష్టం, తక్షణ సాయంపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.



ఏపీలో కరోనా : 
ఏపీలో కరోనా కేసుల నమోదు, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గం చర్చించనుంది. శీతాకాలంలో కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గం దృష్టి సారిస్తుంది. సెకండ్‌వేవ్‌ కూడా వచ్చే ప్రమాదముండడంతో…. వైరస్‌ కట్టడి చర్యలపై చర్చించనుంది. పాఠశాలల్లో వైరస్‌ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు, మరింత పడక్బంధీంగా అమలు చేయాల్సిన అంశాలపై మంత్రులు చర్చించనున్నారు.



రాష్ట్ర ఆర్థిక పరిస్థితి : 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలుపైనా మంత్రిమండలిలో చర్చ జరుగనుంది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం విజయవతంపై కేబినెట్‌ చర్చించనున్నారు. కోర్టు కేసులులేని అన్ని చోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ క్రిస్మస్‌ రోజున ప్రభుత్వం చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైనా చర్చ జరుగనుంది. ఈ అంశంపై జగన్‌.. మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.



పోలవరం ప్రాజెక్టు : 
ఇక ఏపీలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపైనా మంత్రులు చర్చించనున్నారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంపై ఇప్పటికే పలుమార్లు జగన్‌ సమీక్షించారు. కొప్పరి పారిశ్రామిక క్లస్టర్‌, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు వేగవంతం చేయడంపై కేబినెట్‌ చర్చించనుంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర వైఎస్‌ఆర్‌ వంద అడుగుల విగ్రహ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశముంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయ వ్యూహాలపై జగన్‌ మంత్రులతో చర్చించనున్నారు.