నేడు ఏపీ కేబినెట్ మీటింగ్‌..బడ్జెట్ సమావేశాలు, ఉక్కు ప్రైవేటీకరణపై చర్చించే చాన్స్‌

నేడు ఏపీ కేబినెట్ మీటింగ్‌..బడ్జెట్ సమావేశాలు, ఉక్కు ప్రైవేటీకరణపై చర్చించే చాన్స్‌

AP cabinet meeting : ఏపీ మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. సెక్రటేరియట్‌లో జరిగే సమావేశంలో.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కూడా క్యాబినెట్ చర్చించనుంది. ఇదివరకే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడి, ఖర్చులు, అప్పులపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

కరోనా సంక్షోభంతో కుదేలైన రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంపైనా క్యాబినెట్ భేటీలో చర్చిచనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా కేబినెట్‌ మీట్‌లోనే ఖరారు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలు ఉండడంతో.. దీనిపై కెబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అంశంపైనా కెబినెట్‌లో చర్చించే అవకాశముంది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి పీఆర్సీ విషయమై అభిప్రాయాలు స్వీకరించారు. దీంట్లో భాగంగా 30 శాతానికి అటు ఇటుగా పీఆర్సీ ప్రకటించే సూచనలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. దీనిపై కెబినెట్‌ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి వేదికగా మార్చి 4న జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్‌లో మాట్లాడాల్సిన రాష్ట్ర విభజన అంశాలపైనా క్యాబినెట్ చర్చించనుంది. ఇంకా తెగకుండా.. ముడిపడకుండా ఉన్న అనేక విభజన అంశాలు.. ఉద్యోగులు, ఆస్తుల పంపకం, అప్పులు తదితర అంశాలను క్యాబినెట్‌లో చర్చించనుంది మంత్రివర్గం. సదరన్ జోన్ కౌన్సిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వాణి గట్టిగా వినిపించాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది.

ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఆందోళనపైనా కేబినెట్‌ చర్చించనుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోషించాల్సిన పాత్రపై మంత్రివర్గం చర్చించనుంది. విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం కాకుండా చూస్తామన్న సీఎం హామీ మేరకు కేంద్రంపై తీసుకరావాల్సిన ఒత్తిడిపై మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం వుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలంటూ ప్రధానికి లేఖలు రాసినా.. కెబినెట్‌ తీర్మానం ద్వారా కేంద్రాన్ని మరోసారి కోరనుంది ఏపీ సర్కార్‌ .

ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగించగా.. రాబోయే మున్సిపల్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టారు. మెరుగైన ఫలితాల ద్వారా.. తమ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సైతం మెరుగైన ఫలతాలు ఎలా సాధించాలన్న దానిపైనా కేబినెట్‌లో చర్చించనుంది మంత్రివర్గం.