నేడు ఏపీ కేబినెట్ భేటీ…ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు

నేడు ఏపీ కేబినెట్ భేటీ…ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు

AP Cabinet meeting : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కాబోతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతులకు వరదసాయంతోపాటు… కొత్తగా సంక్రాంతి నుంచి ప్రారంభించాలని భావిస్తోన్న రచ్చబండ కార్యక్రమంపై చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం ఈ నెల 25న ముహూర్తం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుంది.

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, కార్యక్రమ విజయవంతంపై మంత్రులు చర్చించనున్నారు. ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కావటంతో ప్రభుత్వం దీనిని ప్రతీ జిల్లాలో పండుగ తరహాలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు కేటాయించనున్నారు.

ఈ నెల 21 నుంచి కాకికాడ సెజ్‌లు, సమగ్ర భూ సర్వే ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సమగ్రంగా భూముల సర్వే చేయనుంది. దీంతో ఈ రెండు కార్యక్రమాలపైనా కేబినెట్‌ చర్చించనుంది. మంత్రులకు జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ఈ నెల 30 నుంచి ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు , తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేయనుంది.

వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో ఈ కార్యక్రమంపై కేబినెట్‌లో చర్చ జరుగనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతోంది. దీంతో తమ పాలనపై ప్రజల నుంచి రచ్చబండ కార్యక్రమం ద్వారా అభిప్రాయ సేకరణ చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించనున్నారు. మంత్రులకు ఈ కార్యక్రమంపై జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ మధ్య రెండు రోజులు ఢిల్లీలో ఉన్న జగన్‌… ప్రధానంగా పెండింగ్‌ నిధులపైనే కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు నిధుల మంజూరుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించే అవకాశముంది. ఢిల్లీ పర్యటన విశేషాలు, కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను మంత్రులకు వివరించనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రగడ నడుస్తూనే ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పదే పదే లేఖలు రాయటం..కోర్టులో ప్రస్తుతం ఈ వ్యవహారం పైన నెలకొన్న పరిస్థితుల గురించి కేబినెట్‌లో చర్చించనున్నారు. ప్రభుత్వం మాత్రం మార్చి దాటిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా కేబినెట్‌ చర్చించనుంది. వీటితోపాటు మరికొన్ని అంశాలపైనా కేబినెట్‌ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.

ఏపీ సీఎస్‌ నీలం సాహ్నికి ఇదే చివరి కేబినెట్‌ సమావేశం. ఈ నెలాఖరున నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నీలం సాహ్ని సేవలను కేబినెట్‌ అభినందిస్తూనే… ఆమె సీనియారిటీని, సేవలను ప్రభుత్వం మరో హోదాలో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని జగన్‌ మంత్రులకు స్పష్టం చేసే అవకాశముంది.