ఇంకెన్ని రోజులో : రాజధాని ఆందోళనలు..హాఫ్ సెంచరీ

  • Published By: madhu ,Published On : February 5, 2020 / 10:05 AM IST
ఇంకెన్ని రోజులో : రాజధాని ఆందోళనలు..హాఫ్ సెంచరీ

రాజధాని రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. ఎప్పటి నుంచి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో..అప్పటి నుంచి ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. 2020, ఫిబ్రవరి 05వ తేదీ బుధవారంకు 50 రోజులకు చేరుకున్నాయి. రాజధానినే అమరావతిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటున్న కేంద్రం.. ఏపీ రాజధాని విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు టీడీపీ కూడా ఆందోళనలు కంటిన్యూ చేస్తోంది. తుళ్లూరులో అమరావతి రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. మూడు రాజధానులంటూ జగన్ తుగ్లక్ లా ప్రవర్తిస్తున్నారని, యావత్ దేశం.. రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటూ వితండవాదం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. 

మరోవైపు రాజధాని విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదు. ఆంధ్రరాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. అమరావతి రైతులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. వీరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.