రాజధాని పిటిషన్లపై అక్టోబర్ 5 నుంచి రెగులర్ విచారణ, ఏపీ హైకోర్టు

  • Published By: naveen ,Published On : September 21, 2020 / 12:54 PM IST
రాజధాని పిటిషన్లపై అక్టోబర్ 5 నుంచి రెగులర్ విచారణ, ఏపీ హైకోర్టు

రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 5 నుంచి రెగులర్ విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. రాజధానిపై స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5వరకు కొనసాగుతాయని తెలిపింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఏజీ శ్రీరామ్ తెలిపారు. కొత్త అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణగా వస్తుందని మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది.

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో 93 పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌ పిటిషన్లపై కోర్టు విచారణ జరపనుంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు, హైపవర్‌ కమిటీ చట్టబద్ధతపై రాజధాని రైతులు పిటిషన్‌ వేశారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించడాన్ని రైతులు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీంతో రాజధానిపై దాఖలైన మొత్తం 93 పిటిషన్లపై ధర్మాసనం విచారించనుంది. రాజధాని తరలింపు చట్టంపై ఇప్పటికే స్టేటస్‌ కో ఇచ్చింది ఏపీ హైకోర్టు.

సీఆర్డీఏ.. రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘనపైనా హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. అలాగే రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్‌పైనా, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైనా రైతులు కేసులు వేశారు. అలాగే రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 విధింపును ఛాలెంజ్ చేశారు.

మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గెజిట్ ను నిలిపివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. రాజభవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఏపీ మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర తెలిపిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. రాష్ట్రంలో ఇకపై పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి ఉంటుంది. ఇక అధికారికంగా మూడు రాజధానులు కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు.

రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయి. మూడు రాజధానులు అంటే పరిపాలనా రాజధాని విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్, సెక్రటేరియట్ ఉంటాయి. అలాగే న్యాయ రాజధానిగా ఉన్న కర్నూలులో కోర్టులు, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన కార్యాలయాలు.. ఇక లెజిస్లేచర్ కేపిటల్‌ అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది.