AP CID notices to TDP chief Chandrababu : చంద్రబాబుకు నోటీసులు ఎందుకిచ్చారు..? ఆ నోటీసుల్లో ఏముంది..?

అసలు టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఎందుకు ఇచ్చారు..? ఆ నోటీసుల్లో ఏముంది. చంద్రబాబుపై ఉన్న అభియోగాలేంటి..?

AP CID notices to TDP chief Chandrababu : చంద్రబాబుకు నోటీసులు ఎందుకిచ్చారు..? ఆ నోటీసుల్లో ఏముంది..?

Chandrababu

AP CID notices to Chandrababu : అసలు టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఎందుకు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఏముంది. చంద్రబాబుపై ఉన్న అభియోగాలేంటి.. అంటే… అమరావతి భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. ఇదే విషయంపై చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి అత్యంత ఖరీదైన భూములను గజం 15 వందలు, 2వేల రూపాయలకే విక్రయించారని, అలా విక్రయించిన భూముల్ని చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టినట్లు ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం రాజధాని భుముల్ని రెసిడెన్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదు. కానీ అక్కడ కొంతమందికి లబ్ధి కలిగేలా భూముల్ని అమ్మినట్లు ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు.

అమరావతిలో 500ఎకరాల భూకుంభకోణంపై ప్రస్తుత ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారని.. దాదాపూ 47.39 ఎకరాల భూముల్ని కొల్లి శివరామ్ అనే వ్యక్తికి ఇచ్చారంటూ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇలా శివరామ్ తో పాటూ ఎవరికి ఎన్ని ఎకరాల భూముల్ని కట్టబెట్టారనే విషయాల్ని ఆ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా… ఈ నివేదికలో భూముల కుంభకోణానికి సంబంధించి కీలక అధారాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గం తేల్చింది.

క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో పేర్కొంది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందని రిపోర్ట్‌లో ఉంది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించారు. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు.

ఏపీ రాజధానికిగా అమరావతిని ప్రకటించడానికి ముందే… తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు సర్వ్ చేశారు. అసైన్డ్‌ రైతులను మోసం చేసి తన అనుచరులకు లబ్ధి కలిగించారని చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదంటూ న్యాయస్థానం చెప్పింది. అయితే… రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని.. అసైన్డ్‌ రైతులు మోసపోయి..అనుచరులకు లబ్ధి కలిగించారని కేసు నమోదు అయింది.

ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా 41 సీఆర్పీసీ కింద టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 23న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని కోరారు. రాజధాని భూముల కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదు చేసింది.