CM Jagan On Pensions : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. పెన్షన్లు పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

CM Jagan On Pensions : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. పెన్షన్లు పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

CM Jagan On Pensions : చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. వచ్చే ఏడాది జనవరి నెల నుంచి పింఛన్లను రూ.2,750కి పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ప్రస్తుతం రూ.2వేల500 ఉన్న పెన్షన్ రూ.2వేల 750కానుంది. అంతేకాకుండా పెన్షన్ మొత్తాన్ని ఇదివరకే చెప్పినట్లుగా రూ.3వేలకు పెంచుతామని కూడా జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో వివిధ వర్గాలకు చెందిన వారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పింఛన్ గా రూ.2,500 ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదే నెలలో మూడో దఫా వైఎస్ఆర్ ఆసరా కూడా అందిస్తామన్నారు సీఎం జగన్.

కుప్పం పర్యటనలో భాగంగా వైఎస్సార్ చేయూత కింద మూడో విడత నిధులను విడుదల చేశారు జగన్. తమ ప్రభుత్వం మహిళల ప్రభుత్వమని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోందని అన్నారు. అమ్మ ఒడి ద్వారా అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామన్నారు. గడచిన మూడేళ్లలోనే మహిళలకు రూ.1.17 లక్షల కోట్లను పంపిణీ చేశామన్నారు. తమ ప్రభుత్వ పథకాల అమలులో లంచాలు లేవని, మధ్యవర్తులు లేరని, వివక్ష లేదని జగన్ స్పష్టం చేశారు.

‘‘మాది మహిళల ప్రభుత్వం. మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. అమ్మఒడి ద్వారా అక్కాచెల్లెళ్లకు తోడుగా నిలబడ్డాం. ఈ మూడేళ్లలో మహిళలకు లక్షా 17వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు లేవు.. మధ్యవర్తులు లేరు.. వివక్ష లేదు. వచ్చే జనవరి నుంచి పింఛను రూ.2,750కు పెంచుతున్నాం. గత ప్రభుత్వాలకు, మాకు తేడా గమనించాలి’’ అని ప్రజలను కోరారు జగన్‌.

వైఎస్ఆర్ చేయూత పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా డబ్బు జమ చేశారు. అనంతరం కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డీబీటీ ద్వారా మొత్తం రూ. 1 లక్షా 71 వేల 244 కోట్ల పంపిణీ చేశామని.. సున్నా వడ్డీ పథకానికి రూ.3,615 కోట్లు అందించామన్నారు. నాలుగు పథకాలకు 39 నెల్లలో 51 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు.