‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ : అమిత్‌షాను కోరిన జగన్‌

‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ : అమిత్‌షాను కోరిన జగన్‌

Jagan Meeting with Amit Shah : ఢిల్లీ టూర్‌లో ఉన్న ఏపీ సీఎం జగన్‌… రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన చర్చించారు. పోలవరంపై ఇద్దరి మధ్య ఎక్కువసేపు చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం 55,650 కోట్లకు ఆమోదం తెలపాలని జగన్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం ల్యాండ్‌ సేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌మెంట్‌ చేయాలన్నారు. 2005-06తో పోలిస్తే… 2017-18 నాటికి తరలించాల్సిన ముంపు ప్రభావిత కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. తద్వారా ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం పెట్టాల్సిన ఖర్చు కూడా పెరిగిపోయిందన్నారు.

పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 1779 కోట్ల రూపాయలను రీయింబర్స్‌ చేయాల్సి ఉందని గుర్తు చేశారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ- బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా.. ఖర్చు ఇంకా పెరిగిపోతుందని… అందుకే కేంద్రం నిధులను విడదుల చేయాలని విన్నవించారు. జాతీయ ప్రాజెక్టయిన పోలవరాన్ని పూర్తి చేయడానికి తగిన విధంగా సహాయం అందించాలన్నారు.

ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానుల అంశం కూడా ఇద్దరి మధ్య చర్చకొచ్చింది. అధికార వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళికలు వేసుకున్నట్టు జగన్‌ వివరించారు. అందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హైకోర్టును కర్నూలులో రీ-లొకేట్‌ చేసేలా ప్రక్రియ ఆరంభించాలని, ఇందుకోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని జగన్‌ విన్నవించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని తెలిపారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ నిధులపైనా అమిత్‌షాకు జగన్‌ మెమోరాండం అందించారు. ఉపాథిహామీ పథకంలో భాగంగా పెండింగులో ఉన్న 3,801.98 కోట్లను విడుదల చేయాలని కోరారు. సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం నుంచి చెల్లించాల్సిన 1600 కోట్లను విడుదల చేయాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు 4308 కోట్లను రిలీజ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 14,15వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన 3066 కోట్ల గ్రాంట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని అమిత్‌షాను కోరారు జగన్‌.

ఏపీలో వర్షాలు, నివార్‌ తుపానుతో కలిగిన పంటనష్టంపైనా జగన్‌ చర్చించారు. పంటనష్టంపై కేంద్ర బృందం పరిశీలన చేసిందని… వెంటనే వరదసాయం నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక సమగ్ర భూ సర్వే కోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్‌ టైటలింగ్‌ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా ప్రక్రియను పూర్తి చేయాలని జగన్‌.. అమిత్‌షాను కోరారు. ఈనెల 21న సమగ్ర సర్వే ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.

మహిళలు, చిన్నారులపై నేరాలను తగ్గించడానికి తీసుకొచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు వెంటనే ఆమోదం పొందేలా చొరవ చూపాలన్నారు. ఏపీకి చెందిన 16 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కోవిడ్‌ సమయంలో తీసుకున్న చర్యలనూ జగన్‌… అమిత్‌షాకు వివరించారు. గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఢిల్లీలోనే ఉన్న జగన్‌ ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశముంది. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ అపాయింట్‌మెంట్‌ దొరికతే ఆయనను కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌, నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, వరదసాయంపై చర్చించే అవకాశముంది.