CM Jagan : ఏపీలో లాక్‌డౌన్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, గ్రామాల్లోనే కరోనా మరణాలెక్కువ

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్‌ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని సీఎం చెప్పారు.

CM Jagan : ఏపీలో లాక్‌డౌన్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, గ్రామాల్లోనే కరోనా మరణాలెక్కువ

Cm Jagan

CM Jagan Review On Corona Situation : ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్‌ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని సీఎం చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే మరణాలు ఎక్కువ:
రాష్ట్రంలో అర్బన్‌ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్‌ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు వెల్లడించారు. ఆలస్యంగా ఆసుపత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించారు. వాలంటీర్‌, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలన్నారు.

ఒక్కరోజే 5వేలకు పైగా కొత్త కేసులు:
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 741 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5వేల 086 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 15,2021) తెలిపింది.

7వేలు దాటిన మరణాల సంఖ్య:
మరో 14మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు చనిపోయారు. అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది. ఇక, 24 గంటల వ్యవధిలో 1,745 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,03,072కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ 200లకు పైగా కేసులు:
ప్రస్తుతం రాష్ట్రంలో 31వేల 710 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,70,201 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో 200కుపైగా కోవిడ్‌ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.