ఈ విజయం నాది కాదు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందన

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ కొత్త రికార్డు సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు.. అన్ని జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగింది. ఫ్యాన్‌ వేగానికి ప్రతిపక్షాలు నిలవలేకపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం కార్పొరేషన్లు కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది వైసీపీ.

ఈ విజయం నాది కాదు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందన

Cm Jagan Elelctions

ap cm jagan tweet on municipal election results 2021: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ కొత్త రికార్డు సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు.. అన్ని జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగింది. ఫ్యాన్‌ వేగానికి ప్రతిపక్షాలు నిలవలేకపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం కార్పొరేషన్లు కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది వైసీపీ.

కొన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యర్థులకు ఒక్క వార్డు కూడా దక్కకపోవడం గమనార్హం. సీఎం జగన్‌ కనీస ప్రచారం చేయకపోయినా వైసీపీ ఈ స్థాయిలో విజయం సాధించడం పట్ల అంతటా చర్చ జరుగుతోంది. ఈ గెలుపుతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. వైసీపీ విజయానికి తమ పార్టీ అధినేత జగన్‌ కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలు తమ పార్టీకి పట్టం కడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాలను గెలుచుకోగా, రెండేళ్ల తర్వాత పార్టీల గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 13 జిల్లాల్లోనూ జగన్ హవా స్పష్టంగా కనిపించింది. విజయం సాధించిన స్థానాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే టీడీపీ గట్టిపోటీ ఇవ్వగలిగింది. బీజేపీ, జనసేన దాదాపు పత్తాలేకుండా పోయాయి. మొత్తం 12 కార్పొరేషన్లకు గానూ 11 చోట్ల వైసీపీ గెలుపొందింది. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ లెక్కింపు ఆగింది. ఇక 75 మున్సిపాలిటీలకుగానూ 74 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే టీడీపీ తన ఖాతాలోకి వేసుకుంది.

ఈ భారీ విజయంపై సీఎం జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మా, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది. ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

3 రాజధానులకు జనాశీర్వాదం..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మూడు రాజధానుల వివాదం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్లు మూడింటినీ వైసీపీ గెలుచుకోవడం.. జగన్ తలపెట్టిన మూడు రాజధానులకు అనుకూలంగా జనం ఇచ్చిన తీర్పు ఇదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో చంద్రబాబు, లోకేశ్ నీతిమాలిన రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జీవీఎంసీలో టీడీపీ గట్టిపోటీ ఇవ్వడం, వైసీపీ చాలా వార్డులు పోగొట్టుకోవడంపై విశ్లేషణ చేసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు.