ఏపీలో జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ

  • Published By: murthy ,Published On : June 23, 2020 / 08:28 AM IST
ఏపీలో జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జూలై8న సీఎం ప్రారంభించనున్నారు. మంగళవారం ఆయన తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీగా ఇళ్లపట్టాలపై పరిస్థితిని సమీక్షించారు. 

ఇళ్లపట్టాల పంపిణీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున 30 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. అధికారులు ఈఅంశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలని సూచించారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని  సీఎం అన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇళ్లపట్టాల లబ్దిదారుల తుది జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పారు. 

కోవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టాక తాను గ్రామాల్లో పర్యటిస్తానని….అప్పుడు ఇంటిపట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తకూడదని సీఎం చెప్పారు. పారదర్శకంగా, ప్రభావ వంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని జగన్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా రావాలని…నాకు ఓటు వేయని వారికి కూడా, వివక్ష లేకుండా ఇళ్లపట్టా ఇవ్వాలని ఆయన అన్నారు. సంతృప్తస్థాయిలో ఇళ్ల పట్టాలను పంపిణీచేయాలని….సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా ఇవ్వకుంటే అందుకు అధికారులను బాధ్యులను చేస్తానని సీఎం హెచ్చరించారు.

పెన్షన్‌ కార్డుకు 10 రోజులు, రేషన్‌ కార్డుకు 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటిపట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలని…ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాద్యత కలెక్టర్లదేనని సీఎం స్పృష్టం చేశారు.