YSR Cheyutha Third Phase : చెక్ చేసుకోండి.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్

వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26లక్షల 39వేల 703 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున రూ.4వేల 949 కోట్లను జమ చేశారు జగన్. ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున జమ చేయడం ఇది వరుసగా మూడోసారి.

YSR Cheyutha Third Phase : చెక్ చేసుకోండి.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్

YSR Cheyutha Third Phase : ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాల కింద లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. తద్వరా వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ చేయూత ఒకటి. ఈ స్కీమ్ కింద మహిళల ఖాతాల్లో ఏటా రూ.18,750 చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. తాజాగా వైఎస్ఆర్ చేయూత మూడో విడత సాయం అందించారు జగన్.

శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26లక్షల 39వేల 703 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున రూ.4వేల 949 కోట్లను జమ చేశారు జగన్. ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున జమ చేయడం ఇది వరుసగా మూడోసారి. ఈ స్కీమ్ కింద ఇప్పటికే 2 విడతల్లో రూ.9వేల 161 కోట్లు అందించారు. ఇప్పుడు మూడో విడతతో కలిసి రూ.14,110.62 కోట్లు మహిళల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పథకం కింద ఒక్కో మహిళకు మూడేళ్లలో అందిన సాయం చూసుకుంటే.. రూ.56వేల 250.

ఈ పథకానికి 45-60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు అర్హులు. కాగా మొత్తం నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి రూ.75వేలు అందనున్నాయి. ఈ చేయూత పథకం ద్వారా 2020 ఆగస్టులో.. తొలి విడత కింద 24,00,111 మందికి 4,500.21 కోట్లు.. 2022 జూన్‌ 22న రెండో విడతగా 24,95,714 మందికి 4,679.49 కోట్లు ఖాతాల్లో జమ చేశారు.

ఒకవేళ అన్ని విధాల అర్హులైన ఉండి.. వైఎస్ఆర్ చేయూత నగదు జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 48 గంటల వరకు చూసిన తరువాత.. సచివాలయానికి వెళ్లి.. మీరు అర్హులు అనే నిరూపించే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. నిజమైన అర్హులని తేలితే వారికి నగదు అందేలా ఏర్పాట్లు చేస్తారు.

అన్ని రకాల సంక్షేమ పథకాల ద్వారా అన్ని కుటుంబాలకు నేరుగా లక్షా 71వేల 244 కోట్లు అందించామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఎక్కడా అవినీతి లేకుండా, అర్హతే ప్రామాణికంగా అందించామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ కాకుండా.. ఇళ్ల పట్టాలు- ఇళ్ల నిర్మాణం.. ఇతర పథకాల ద్వారా 39 నెలల కాలంలో లక్షా 41 వేల కోట్లు అందించినట్లుగా చెప్పారు. రెండు రకాలుగా అందించిన సాయం చూసుకుంటే.. మొత్తంగా ఈ 39 నెలల కాలంలో 3 లక్షల 12 వేల కోట్ల రూపాయలు అందించామని సీఎం వివరించారు. వరుసగా మూడో ఏడాది కూడా 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తున్నామని, ఈ ఏడాదికిగానూ అక్కచెల్లెమ్మల కోసం రూ.4,949 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు.

ఒక్క చేయూత ద్వారానే మూడేళ్లలో రూ.14,110 కోట్ల సాయం అందించామని, అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అలాగే ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ.12,758 కోట్లు, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. వివక్ష లేకుండా.. బటన్‌ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతోందన్నారు. గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా గమనించాలని, ఒక్కసారి ఆలోచించమని ప్రతీ అక్కచెల్లెమ్మను కోరారు సీఎం జగన్‌. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించాలనే స్వేచ్ఛను అక్కచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టామని, అది ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలని, అవసరమైన సాంకేతికత ప్రభుత్వం తరపున అందిస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్‌.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించారు. జనవరి నుంచి పెన్షన్ పెంచుతామన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద.. రాష్ట్రంలో ప్రస్తుతం వృద్దులకు రూ.2వేల 500 పెన్షన్ అందుతోంది. సీఎం జగన్ తాజా ప్రకటనతో జనవరి నుంచి పెన్షన్ రూ.2వేల 750 కానుంది. ప్రతి ఏటా పెన్షన్ ను 250 రూపాయలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారు జగన్. అందులో భాగంగానే రెండు విడతలుగా పెంచారు. వచ్చే జనవరి నుంచి మూడో విడతగా మరో 250 రూపాయలు పెంచనున్నారు. అంతేకాదు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ ను రూ.3వేలకు పెంచుతామన్నారు సీఎం జగన్.