ప్రతి లోక్ సభ నియోజక వర్గం ఓ జిల్లా : సీఎం వైస్ జగన్

ప్రతి లోక్ సభ నియోజక వర్గం ఓ జిల్లా : సీఎం వైస్ జగన్

ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వారికి మార్గనిర్దేశం చేశారు.

పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్‌ అర్బన్‌ (వార్డు) హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలని… 2 కి.మీ పరిధిలో కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లే దూరంలో వీటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇందుకు వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉన్నాయని.. కొత్తగా మరో 16 ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించి, వెంటనే సంబంధిత శాఖలకు అప్పగించాలని  ఆయన అధికారులను ఆదేశించారు.  కర్నూలు జిల్లా ఆదోనిలో ఒకటి నెలకొల్పనున్నట్లు  సీఎం తెలిపారు.

2018 రబీ పంటల బీమాకు సంబంధించి 5 లక్షల మందికి పైగా రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.596 కోట్లను 26న చెల్లించబోతున్నామని చెప్పారు. ఆగస్టు 9న ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసి, తద్వారా గిరిజనులకు జీవనాధారం చూపించాలి. అప్పుడే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందే అవకాశాలు ఉంటాయని సీఎం జగన్ అన్నారు.

నాడు–నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి
స్కూళ్లు తెరిచేలోగా నాడు –నేడు కింద పనులు పూర్తి కావాలి. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి వస్తుంది. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. ఫర్నిచర్, ఫ్యాన్లు.. అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి. పనులు పూర్తి కాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది.  కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి.  అర్బన్‌ ప్రాంతాల్లో కాంపౌండ్‌ వాల్‌ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది. నాడు – నేడుకు నిధుల కొరత లేదు. వెంటనే మున్సిపల్‌ కమిషనర్లతో సమన్వయం చేసుకుని స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలి.

అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం 
నాడు– నేడు కింద 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ఢి చేస్తున్నామని…. భవనాలు ఉన్న చోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తామని సీఎం చెప్పారు.  సొంతంగా భవనాలు లేని చోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. వీటి కోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్‌కు బదిలీ చేయాలని ఆయన అన్నారు.

పచ్చదనం పెంపులో భాగంగా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి
పచ్చదనం పెంపునకు జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాడు –నేడులో స్కూళ్లకు ప్రహరీలు నిర్మిస్తున్నందు వల్ల అక్కడ.. ఇంకా ఖాళీ స్థలాలు, ఇంటర్నల్‌ రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఇళ్ల స్థలాల లే అవుట్‌లలో కూడా బాగా మొక్కలు నాటాలి. ప్రతి ఇంటి స్థలం పట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కలు ఇవ్వాలి.

ఇ-క్రాపింగ్ 
చాలా ముఖ్యం. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు ఇ–క్రాపింగ్‌ పటిష్టంగా అమలు  అయ్యేలా చూడాలని సీఎం అన్నారు. పంటలు కొనుగోలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, పంట రుణాలు ఇవ్వాలంటే ఇ–క్రాపింగ్‌  ముఖ్యం. హార్టికల్చర్, ఫిషరీస్‌ కూడా ఇ– క్రాపింగ్‌లో నమోదు కావాలి. ఆర్బీకేల కోసమే ఒక జాయింట్‌ కలెక్టర్‌ను పెట్టాం. 10,641 ఆర్బీకేలు, 65 ఆర్బీకే హబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల కోసం.. రైతులు ఆర్డర్‌ ఇవ్వగానే 48 గంటల్లోగా అవి డెలివరీ కావాలని సీఎం ఆదేశించారు.

కోవిడ్‌–19 వ్యాప్తి నివారణపై ఫోకస్
వ్యాక్సిన్‌ కనుక్కునేంత వరకూ కోవిడ్‌తో కలిసి బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని…. నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మనం ఫోకస్‌ పెట్టాలని సీఎం అన్నారు. దాని పట్ల ఉన్న భయం (స్టిగ్మా తొలగించాలి) పోవాలి. ఆ మేరకు చైతన్యం, అవగాహన కలిగించాలి. అప్పుడే మరణాలు తగ్గుతాయని ఆయన చెప్పారు. కోవిడ్‌ సోకిందనే అనుమానం రాగానే వెంటనే చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. భయం, ఆందోళనతో చివరి వరకూ చెప్పకపోతే అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఆ పరిస్థితి రాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్‌ సోకిందన్న అనుమానం రాగానే.. ఏం చేయాలన్న దానిపై ఎస్‌ఓపీపై అవగాహన కల్పించాలి.

జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సదుపాయాలపై దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. 85 శాతం కేసులు ఇంట్లోనే ఉన్నా నయం అయిపోతాయి. వారికి మందులు ఇవ్వాలి. ఆ యంత్రాంగం కరెక్టుగా ఉందా లేదో పరిశీలించాలి. ఆస్పత్రులకు వచ్చే 15 శాతం మందికి సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా చూడండి. ప్రతి జిల్లాకు కనీసం 1500 బెడ్లు ఉండేలా చూసుకోవాలి. అక్కడ సదుపాయాలు బాగా ఉండేలా చూసుకోండి.

108, 104 వాహనాలు ఒకేసారి 1060 ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ కూడా కొత్త వాహనాలే. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది. ఈ వెహికల్‌ ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న వారికి స్క్రీనింగ్‌ చేయాలి. ఇంటింటికీ సర్వే చేసి, ప్రతి ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్య వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు చేయాలి. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యా«ధులున్న 40 ఏళ్లకు పైబడ్డ వారికి పరీక్షలు చేయాలి. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉంటాయి. ఈ మందులను వారికి అందించాలి.

Read: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 462 పాజిటివ్ కేసులు