ఏపీలో ఆలయాల భద్రత.. ఎస్పీలు, సీపీలకు డీజీపీ కీలక సూచనలు

  • Published By: naveen ,Published On : September 13, 2020 / 12:18 PM IST
ఏపీలో ఆలయాల భద్రత.. ఎస్పీలు, సీపీలకు డీజీపీ కీలక సూచనలు

ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం(సెప్టెంబర్ 13,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి కీలక సూచనలు చేశారు. మతపరమైన అంశాల పట్ల పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని డీజీపీ చెప్పారు. అలాగే ఆలయాలు, ప్రార్థనా మందిరాల నిర్వాహాకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి దేవాలయం దగ్గర పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలని, పాయింట్ బుక్ ను స్థానిక పోలీసు అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాల భద్రతపై జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ చెప్పారు.

ఏపీలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల దగ్గర పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ సూచించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలకు అప్రమత్తం చేశామన్నారు.

దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్న ఆయన రాష్ట్రంలోని దేవాలయాలు, ప్రార్థన మందిరాల దగ్గర అన్ని భద్రత చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మతసామర్యానికి ప్రతీకైన ఏపీలో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీ అన్నారు. అలాంటి వారిని పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని, కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో సెప్టెంబర్ 5న అర్థరాత్రి దివ్య రథం అగ్నికి ఆహుతయింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రథం 40 ఎడుగుల ఎత్తు ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. అలాంటి రథం మంటల్లో కాలిపోవడంతో భక్తులు, హిందూ సంఘాలు భగ్గుమన్నారు.

రథానికి మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేక కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనుక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయంది.