ఇంటికే రేషన్ బియ్యం : బస్తాపై క్యూ ఆర్ కోడ్, వాహనాల్లో జీపీఎస్, ఇక అక్రమాలకు చెక్ – మంత్రి కన్నబాబు

  • Published By: madhu ,Published On : November 5, 2020 / 04:21 PM IST
ఇంటికే రేషన్ బియ్యం : బస్తాపై క్యూ ఆర్ కోడ్, వాహనాల్లో జీపీఎస్, ఇక అక్రమాలకు చెక్ – మంత్రి కన్నబాబు

AP Doorstep Delivery Of Quality Rice : ఇంటికే రేషన్ బియ్యం తీసుకొచ్చి, నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి కన్నబాబు. సరఫరా చేసే విధానం ఖరారు చేశామన్నారు. 2021, జనవరి 01 తేదీ నుంచి ఇంటికే రేషన్ బియ్యం అమలు చేస్తామన్నారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు.




9 వేల 260 మొబైల్ వాహనాలు :-
పౌరసరఫరాల శాఖ ద్వారా లబ్దిదారులకు బియ్యాన్ని అందించడానికి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
సిఫార్సులకు అనుగుణంగా..9 వేల 260 మొబైల్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మరో 20 శాతం ఈబీసీలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.




బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం :-
ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం ఇస్తుందని, ఇక్కడ లబ్దిదారుడు కేవలం 10 శాతం భరించాల్సి ఉంటుందన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత వాహనం లబ్దిదారుడికి సొంతం అవుతుందన్నారు. ఇక బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఇందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నట్లు తెలిపారు. ప్రతి బియ్యం బస్తాపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, బియ్యం సంచి ఎక్కడి నుంచి బయటకు వెళ్లిందో సులువుగా తెలుస్తుందన్నారు.


వినియోగదారుడికి రెండు బస్తాలు :-
వాహనాల్లో జీపీఎస్ సిస్టం పెడుతామని, ట్రాకింగ్ సిస్టం ద్వారా బియ్యం పంపిణీ ఎక్కడ జరుగుతుందో తెలిసిపోతుందన్నారు. రేషన్ బియ్యం కోసం క్యూలు కట్టే పరిస్థితులు ఇక ఉండవని, శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు నడుస్తోందని తెలిపారు. దీనికోసం వినియోగదారుడి కోసం రెండు బ్యాగులు ఇస్తామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.