ఏపీ పంచాయతీ ఎలక్షన్స్..ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులు..పలు చోట్ల ఘర్షణలు

ఏపీ పంచాయతీ ఎలక్షన్స్..ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులు..పలు చోట్ల ఘర్షణలు

Clashes in AP panchayat elections : ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట గ్రామంలో ఎన్నికలకు ముందే దాడులు జరిగాయి. టీడీపీ మద్దతు ఉన్న తంగెళ్ల నాగేశ్వరరావుపై రాత్రి దాడి జరిగింది. తాము గెలుస్తామన్న అక్కసుతోనే అధికార పార్టీ మద్దతు ఉన్న అభ్యర్ధి వమ్ము వరలక్ష్మి దాడి చేయించారని నాగేశ్వరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇనుపరాడ్లు, కర్రలతో దాడి జరగడంతో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ చెలరేగింది. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులు రాసి పంపుతున్నారని ఆరోపించారు. పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థి ఇలా చేస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని కె.వి.పాలెం గ్రామంలో ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్‌ బూత్‌ వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓటు వేసే విషయంలో తలెత్తిన వివాదం.. ఘర్షణకు దారితీసింది. ఓటు వేసే విషయంలో ఇబ్బంది పడుతున్న ఓటరుకు సాయంగా.. వైసీపీ ఏజెంట్‌ ఆ ఓటు వేయబోతుండగా.. టీడీపీ ఏజెంట్‌ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, బాహాబాహి జరిగింది. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం శంభునిపాలెం గ్రామస్థులు మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎస్సీలుగా ఉన్న తమను ఓసీలుగా చూపుతూ కుట్ర పన్నారని గ్రామస్థులు ఆరోపించారు. నామినేషన్‌ వేసిన తర్వాత తమ కులాన్ని మార్చివేసి…వేరే అభ్యర్థిని పోటీలో పెట్టారని చెబుతున్నారు.