అందరూ ఉన్నా అనాథగా అనంతలోకాలకు : గుజరాత్ లో మత్స్యకారుడి అంత్యక్రియలు

  • Published By: madhu ,Published On : April 23, 2020 / 02:48 AM IST
అందరూ ఉన్నా అనాథగా అనంతలోకాలకు : గుజరాత్ లో మత్స్యకారుడి అంత్యక్రియలు

పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. లాక్‌డౌన్‌ కారణంతో కుటుంబసభ్యులకు ఆఖరిచూపు కూడా లేకుండా పోయింది. మృతదేహం తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు జరిపారు తోటి కూలీలు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా అనంతలోకాలకు వెళ్లిపోయాడు. 

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నంకు చెందిన కోయి రాజు…గుజరాత్‌లోని వేరావల్‌లో 8 నెలలుగా చేపల వేట పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా సొంతూళ్లకు వచ్చే అవకాశం  లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయాడు. నెలరోజులుగా బొట్లలోనే ఉంటూ దుర్భర జీవితం గడిపాడు. అయితే మురికినీళ్లలో ఉండటంతో కోయి రాజు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు. చికిత్స  సదుపాయం లేకపోవడంతో అక్కడే ప్రాణాలు వదిలాడు.

మృతదేహాన్ని తరలించే అవకాశం కూడా లేకపోవడంతో తోటి మత్స్యకారులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం చివరిచూపు  కూడా దక్కకపోవడంతో రాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో బాధితుడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన సుమారు 5వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వేరావల్‌ ఫిషింగ్ హార్బర్‌లో పనిచేస్తున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు కోయి రాజు మృతితో…మిగిలిన మత్స్యకారులు, వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. గుజరాత్‌లో తమ వాళ్లు పడుతున్న ఇబ్బందులను కుటుంబసభ్యులు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారిని  క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా చూడాలని వేడుకున్నారు. మరోవైపు ఇప్పటికే గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌రూపానీని.. సీఎం జగన్‌ ఫోన్‌లో కోరారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.