ఆన్‌లైన్ రమ్మీ జూదంపై ఏపీ ప్రభుత్వం నిషేధం, రెండేళ్లు జైలు శిక్ష, కేబినెట్ కీలక నిర్ణయాలు

10TV Telugu News

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ రమ్మీ వంటి జూద క్రీడలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆన్ లైన్ లో జూదం ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. ఆన్ లైన్ రమ్మీ నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ చెప్పారు. ఉచిత విద్యుత్ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ విద్యుత్ బకాయిలను తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామన్నారు.

కేబినెట్ నిర్ణయాలు:
* ఆన్ లైన్ రమ్మీ వంటి జూద క్రీడలపై నిషేధం
* ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం
* మచిలీపట్నంలో షటరింగ్ పథకానికి ఆమోదం
* గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు స్థలం కేటాయింపు
* విజయనగరం జిల్లా సుజల స్రవంతి పథకానికి ఆమోదంఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై సుదీర్ఘ చర్చ:
రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. విద్యుత్ నగదు బదిలీపై రైతులకు అర్థమయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యే, స్థానిక అధికారులకు అప్పటించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.

రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే:
రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని తేల్చి చెప్పిన సీఎం జగన్, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కనెక్షన్ ఉన్న రైతుపేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేస్తామని, ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందన్నారు. ఆ డబ్బుని రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని జగన్ స్పష్టం చేశారు. మీటర్ల ఖర్చు డిస్కంలు, ప్రభుత్వానిదే అని చెప్పారు.వచ్చే 30 నుంచి 35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా ఉండదు:
ప్రస్తుత సంస్కరణల వల్ల రైతుపై ఒక్క పైసా భారం కూడా ఉండదని జగన్ అన్నారు. ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. వచ్చే 30 నుంచి 35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా లేకుండా చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు చేస్తున్నామని అన్నారు. రబీ సీజన్‌ నుంచి పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైఎస్ఆర్‌కు దక్కుతుందని సీఎం జగన్ అన్నారు.

×