AP Govt : చిన్నతరహా పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు.. రూ.1,124 కోట్లు విడుదల

ఏపీ ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ సీఎం జగన్ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు.

AP Govt : చిన్నతరహా పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు.. రూ.1,124 కోట్లు విడుదల

Jagan

small scale industries : ఏపీ ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. శుక్రవారం (సెప్టెంబర్ 3, 2021) క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రోత్సహకాలను విడుదల చేశారు. ఎంఎస్ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు రూ.684 కోట్లు ప్రోత్సహాకాలను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ రంగాలకు రూ.2,086.42 కోట్లు విడుదల చేశారు. ఎంఎస్ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో హడావుడి ఎక్కువగా ఉండేది..పని తక్కువగా జరిగేదని సీఎం జగన్ తెలిపారు. పరిశ్రమలను నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

25 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. పారదర్శకంగా, వివక్ష లేకుండా లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలకూ పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 62 శాతం, మహిళలకు 42 శాతం ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశామని వెల్లడించారు. కొప్పర్తిలో వైఎస్ఆర్ ఈఎంసీ పార్కును స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వైఎస్ఆర్ ఈఎంసీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండేళ్లలో రాష్ట్రంలో 68 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపారు. త్వరలో మరో 62 భారీ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మరో 9 కొత్త ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.