ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం, ఆ విద్యాసంస్థలు మూసేయండి

ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను...

ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం, ఆ విద్యాసంస్థలు మూసేయండి

Covid 19 Cases

School Colleges CoronaVirus: ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను వెంటనే మూసేయాలని అధికారులతో చెప్పారు మంత్రి సురేష్. కరోనావైరస్ మహహ్మారి మళ్లీ పుంజుకుంటోందని.. రెండు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. రాజమండ్రిలోని ప్రైవేట్ కాలేజీలో 168 మంది కరోనా బారిన పడ్డారని చెప్పారు. వారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూల్, కాలేజీల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని మంత్రి వెల్లడించారు.

పెద్ద ఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని మంత్రి అన్నారు. మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడంతో అకడమిక్ క్యాలెండర్‌ను గాడిలో పెట్టామన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు ఏపీలోనే చేశామని మంత్రి చెప్పారు.

కరోనా గుప్పిట్లో విశాఖ ఏయూ:
విశాఖ ఏయూలోనూ కరోనా కలకలం రేగింది. ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ క్యాంపస్ లో ఒకే రోజు 50మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఏయూ పరిధిలో బీఈ, బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లోనూ కరోనా కేసులు పెరగడంతో పరీక్షలు వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఏయూ క్యాంపస్ లో 800మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 400మంది విద్యార్థులకు సంబంధించి కరోనా పరీక్షల రిపోర్టులు రాగా, ఇంకా 400మందికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు 65మంది కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వీరంతా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు కావడంతో ఇంకెంతమందికి పాజిటివ్ వస్తుందో అనే ఆందోళన నెలకొని ఉంది.

మరిన్ని పాజిటివ్ కేసులు పెరిగే చాన్సుందని అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు ఇంజినీరింగ్ క్యాంపస్ హాస్టల్ ను క్వారంటైన్ జోన్ గా ప్రకటించారు. ఇక ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ లో కరోనా కలకలం రేగింది. 700మంది బాయ్స్ కు టెస్టులు చేయగా 65మందికి పాజిటివ్ అని తేలింది. హాస్టల్ లోని ఒక బ్లాక్ ను ఐసోలేషన్ చేశామని కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.