పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై స్టే కోరుతూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై స్టే కోరుతూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

AP government petitions High Court : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పంచాయితీ ముదిరింది. పంచాయతీ ఎన్నికల ష్యెడ్యూల్‌పై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌లో ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేసింది. అయితే… ఇవాళ సమయం ముగియడంతో… సోమవారం విచారిస్తామని ఏపీ హైకోర్ట్ స్పష్టం చేసింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2021, జనవరి 8వ తేదీ శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ షెడ్యూల్ విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. దీంతో 2021, జనవరి 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో… షెడ్యూల్ ఇవ్వడం ఏంటని మండిపడుతోంది. కరోనా వ్యాక్సిన్ సన్నద్ధతలో అధికారయంత్రాంగం అంతా ఉందని, వ్యాక్సిన్ నేషన్ వల్ల స్థానిక ఎన్నికల నిర్వాహణ సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడిస్తోంది.

ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘననే అని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యాఖ్యానించారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో ఉన్నామని చెప్పినా..మొండి వైఖరి అవలంబిస్తున్నారని తెలిపారు.