Catfish Farming : 10 టీవీ ఎఫెక్ట్ : క్యాట్ ఫిష్ పెంపకందారులపై క్రిమినల్‌ కేసులు

10టీవీ వరుస కథనాలతో ఏపీ సర్కార్‌ కదిలింది. డెడ్లీ క్యాట్‌ఫిష్‌ సాగుపై చర్యలకు సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోన్న కేటుగాళ్ల తాట తీసేందుకు రెడీ అయింది.

Catfish Farming : 10 టీవీ ఎఫెక్ట్ : క్యాట్ ఫిష్ పెంపకందారులపై క్రిమినల్‌ కేసులు

Ap Government Raids On Illegal Catfish Farming

Catfish Farming : 10టీవీ వరుస కథనాలతో ఏపీ సర్కార్‌ కదిలింది. డెడ్లీ క్యాట్‌ఫిష్‌ సాగుపై చర్యలకు సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోన్న కేటుగాళ్ల తాట తీసేందుకు రెడీ అయింది. ఇటు నేతలు.. అటు అధికారులు దీనిపై దృష్టిసారించారు. అనారోగ్యానికి కారణమయ్యే చేపల పెంపకాన్ని అడ్డుకునేందుకు యాక్షన్‌లోకి దిగారు. పోలీసులు దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

నిషేధిత చేపల సాగుపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ప్రకాశం జిల్లాలో గుట్టచప్పుడు కాకుండా క్యాట్‌ ఫిష్‌ను సాగుచేస్తున్న వ్యవహారంపై.. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. అడ్డగోలుగా సాగుతున్న క్యాట్‌ ఫిష్‌ పెంపకంపై సీరియస్‌ అయ్యారు. ప్రకాశం జిల్లాలో క్యాట్‌ఫిష్‌ పెంపకంపై సమగ్ర విచారణ చేపట్టాలని కమిషనర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌కు ఆదేశాలు జారీ చేసి.. 24 గంటల్లో నివేదిక ఇవ్వమని ఆదేశించారు మంత్రి అప్పలరాజు. క్యాట్‌ ఫిష్‌ పెంపకంపై రాష్ట్రంలో నిషేధం ఉందని.. క్యాట్‌ ఫిష్‌ను పెంచుతున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇటు ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం కూడా 10 టీవీ కథనాలు చూసి కదిలింది. ప్రకాశం జిల్లాలో క్యాట్‌ ఫిష్‌ పెంపకంపై 10టీవీలో వరుస కథనాలు ప్రసారం కావడంతో.. మత్స్యశాఖ సిబ్బందితో ఫిషరీస్‌ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు. క్యాట్ ఫిష్ సాగుచేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. క్యాట్ ఫిష్ సాగుకు అనుమతులు లేవన్న చంద్రశేఖర్‌రెడ్డి.. కొందరు కోవిడ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నట్లు చెప్పారు. పర్యవేక్షణా లోపం, అధికారుల పాత్ర ఉంటే వారిపై కూడా చర్యలు తప్పవని జేడీ హెచ్చరించారు. జిల్లాలోని చెరువులపై వెంటనే దాడులు చేస్తామన్నారు.

మరోవైపు ఇదంతా మామూలే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ చాలాసార్లు క్యాట్‌ఫిష్‌ పెంపకాలు, అమ్మకాలు సాగాయని.. అయినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటు దేశంలో 17 ఏళ్ల క్రితమే క్యాట్‌ఫిష్‌ పెంపకం, అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే నిర్వాహకులు మాత్రం లెక్క చేయడం లేదు. లాభాలే ధ్యేయంగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. పంటపొలాలను కాలుష్యం బారిన పడేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.

ఏపీ ప్రభుత్వం కూడా పర్యావరణానికి, స్థానిక మత్స్యజాతులకు ముప్పు కలిగించే విదేశీ రకాలకు చెందిన చేప, రొయ్య పిల్లల ఉత్పత్తి, పంపిణీ, విక్రయాలపై నిషేధం విధించింది. ఈ జాబితాలో ఆఫ్రికన్‌ క్యాట్‌ ఫిష్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి దీనిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఇవన్నీ జరుగుతున్నా.. అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. ఎవరికీ తెలియకుండా.. పరిస్థితులను అనువుగా చేసుకొని యధేచ్చగా క్యాట్‌ఫిష్‌ల సాగు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు 10 టీవీ చేసిన ప్రయత్నం ఫలించింది. 10 టీవీ ఈ గుట్టును బయటపెట్టడంతో అధికార యంత్రాంగం హుటాహుటిన చర్యలకు సిద్ధమైంది. క్యాట్‌ఫిష్‌ల కథను సమాప్తం చేసేందుకు రంగంలోకి దిగింది.