Volunteers Honour : వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త.. రూ.261 కోట్లు విడుదల

అత్యుత్తమ సేవలు కనబరిచిన గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉగాది రోజున సత్కారం చేయాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు గాను ప్రభుత్వం సర్వం చేస్తోంది. తాజాగా సత్కార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వాలంటీర్లను సత్కరించడం సహా ఇతర అవసరాలకు గానూ రూ.261 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

Volunteers Honour : వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త.. రూ.261 కోట్లు విడుదల

Volunteers Honour

Volunteers Honour : అత్యుత్తమ సేవలు కనబరిచిన గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉగాది రోజున సత్కారం చేయాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు గాను ప్రభుత్వం సర్వం చేస్తోంది. తాజాగా వాలంటీర్ల సత్కార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం రూ.261 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. వాలంటీర్లకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

సేవావజ్ర-30వేలు, సేవారత్న-20వేలు, సేవామిత్ర-10వేల:
మూడు కేటగిరీల కింద విశిష్ట సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కారం చేయనుంది ప్రభుత్వం. పురస్కారాలతో పాటు నగదు కూడా ఇవ్వనుంది. సేవావజ్ర-30వేలు, సేవారత్న-20వేలు, సేవామిత్ర-10వేల నగదు ప్రోత్సాహాకాలు అందించనుంది ప్రభుత్వం. అలాగే శాలువాతో గౌరవిస్తారు. ప్రకృతి వైపరీత్యాల్లో అందించిన సేవలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. మూడు కేటగిరీల్లో ఇప్పటికే 2లక్షల 22వేల 900మంది గ్రామ, వార్డు వాలంటీర్లని ఎంపిక చేశారు.

ఉగాది నుంచి ప్రతి జిల్లాలో సత్కారాలు:
ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వాలంటీర్లకు అవార్డులు, సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మొదటి కేటగిరీలో 2,18,115 మంది వాలంటీర్లకు ‘సేవా మిత్ర’ అవార్డు అందజేస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన వారికి అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.10 వేలు నగదు, ప్రశంసా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు.

రెండో కేటగిరీలో 4వేల మంది:
రెండో కేటగిరీలో 4,000 మంది వాలంటీర్లకు ‘సేవా రత్న’అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున, కార్పొరేషన్లలో పది మంది చొప్పున మొత్తం 4వేల మంది వాలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.

మూడో కేటగిరిలో 875మంది:
మూడో కేటగిరీలో 875 మంది వాలంటీర్లకు ‘సేవా వజ్ర’ అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. ఉగాది రోజున సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది.

ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజల ఇంటివద్దకే అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం జగన్ సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వారికి గౌరవ వేతనం ఇస్తూ విధుల్లోకి తీసుకున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిలా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు.