రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు గుడ్ న్యూస్

రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు గుడ్ న్యూస్

ration door delivery vehicle Drivers : రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ మొబైల్‌ వాహనదారులకు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో రేషన్‌ పంపిణీ వాహనదారునికి.. వాహన అద్దె, పెట్రోల్, హెల్పర్‌ చార్జ్‌ల కింద 16 వేల రూపాయలు చెల్లిస్తుండగా.. ఇకపై మొత్తంగా 21 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీరు పడుతున్న ఇబ్బందులను గుర్తించి..వారి మేలు చేకూరే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కో వాహనదారుడికి రూ. 5 వేలు అదనంగా అందనుంది. వాహనాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలని, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నారు.

ప్రతీ నెలా.. రేషన్ లబ్దిదారుని ఇంటి వద్దకే స్వర్ణరకం బియ్యాన్ని అందించేందుకు సీఎం జగన్ రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించారు. సంవత్సరానికి 830 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వేదికగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి 2 వేల 500 డోర్‌ డెలివరీ వాహనాలను సీఎం జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు.

9వేల 260 మొబైల్‌ వాహనాలను 539 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు ఉపాధి కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందించింది. ఒక్కో వాహనం విలువ 5 లక్షల 81వేలు కాగా.. 60శాతం సబ్సిడీతో 3లక్షల 48వేల 600 రూపాయల సబ్సిడీ అందించింది. ఈ వాహనాలకు పౌర సరఫరాల శాఖ ప్రతీ నెలా అద్దె చెల్లిస్తూ ఆరు సంవత్సరాలపాటు వినియోగించుకోనుంది.