PRC Issue : క్లైమాక్స్ చేరిన ఏపీ పీఆర్సీ ఎపిసోడ్

ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్‌లలో మార్పులు, పింఛనుదారులకు...

PRC Issue : క్లైమాక్స్ చేరిన ఏపీ పీఆర్సీ ఎపిసోడ్

Ap Prc

AP Govt Employees : పీఆర్‌సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించింది. HRA శ్లాబులు, CCA కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, CPS రద్దు లాంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినా… మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ ఏదీ లభించలేదు. HRA శ్లాబ్‌లపై ఉద్యోగుల డిమాండ్‌లు, వాటిని నెరవేరిస్తే ప్రభుత్వంపై పడే భారం లాంటి అంశాలపై 2022, ఫిబ్రవరి 05వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మంత్రుల కమిటీ, ఆర్థికశాఖ అధికారులు భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ మరోసారి సమావేశమవనుంది. అవసరమైతే ఆ సమావేశం అనంతరం…. ముఖ్యమంత్రి జగన్‌తోనూ ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యే అవకాశం ఉంది.

Read More : Statue of Equality : రామానుజచార్యుల సువర్ణ విగ్రహావిష్కరణ, మోదీ పర్యటన ఇలా

ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్‌లలో మార్పులు, పింఛనుదారులకు అదనపు క్వాంటం పింఛను లాంటి అంశాలపై కొన్ని ప్రతిపాదనల్ని ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచినట్టు తెలిసింది. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు PRC విషయంలో చాలా అంశాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో తాము ముందే ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. అటు చలో విజయవాడకు వేల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలిరావడం, నిరసన విజయవంతం కావడంతో తదుపరి కార్యాచరణకు ఉద్యోగసంఘాలు నడుంకట్టాయి. ప్రస్తుత చర్చల్లో చాలా వరకు సానుకూలత తీసుకువచ్చామన్నారు మంత్రి బొత్స. శనివారం ఉద్యోగులు చేపట్టనున్న సహాయ నిరాకరణ విరమించుకోమని కోరామన్నారు. అయితే చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.