విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై విచారణ కమిటీ…సీఎం జగన్ ను కలిసిన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు 

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 02:01 PM IST
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై విచారణ కమిటీ…సీఎం జగన్ ను కలిసిన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు 

విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ సీఎం జగన్ ను ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు కలిశారు. గ్యాస్ లీక్ ఘటన సంబంధించి ప్రతినిధులు.. సీఎంకు వివరించారు. ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదంపై ఇప్పటికే విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఫారెస్టు అండ్ ఎన్విరాన్ మెంట్ స్పెషల్ సీఎస్ నేతృత్వంలో ఈ కమిటీ ఉంటుంది. కమిటీ సభ్యులుగా విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర సీపీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పీసీబీ కార్యదర్శి ఉంటారు. 

ఈ ఐదుగురు కూడా ఘటనపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఘటనకు గల కారణాలు ఏంటీ? ఎంతమంది మృత్యువాత పడ్డారు. ఎ తమంది క్షతగాత్రులు అయ్యారు? ఘటన ఏవిధంగా జరిగింది? భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీ నివేదిక అధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. 

ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని ప్రాథమిక విచారణలో తేలింది.   కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా అధికారులను సమాయత్తం చేశారు. అస్పత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. క్షతగాత్రులు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తక్కువ ప్రాణ నష్టం జరిగే విధంగా చూడాలన్నారు.