మూడు రాజధానులపై AP ప్రభుత్వం దూకుడు..సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్

  • Published By: nagamani ,Published On : August 8, 2020 / 01:32 PM IST
మూడు రాజధానులపై AP ప్రభుత్వం దూకుడు..సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్

మూడు రాజధానుల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పరిపాలన విభాగాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్నంకు తరలించాలని పట్టుపట్టుకుని కూర్చుంది. దీన్ని త్వరగా చేయాలని సీఎం జగన్ దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా ఏమాత్రం తగ్గట్లేదు.



ఈ క్రమంలో ఇటీవల సీఆర్డీయే రద్దు బిల్లుకు ఆమోదముద్ర వేయగా.. హైకోర్టు దీనిపై ఆగస్టు 14 వరకు స్టేటస్ కో విధించింది. దీంతో తరలింపు పక్రియ ఆగిపోయింది. దీంతో ఆలస్యం భరించలేక ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ప్రభుత్వం తరుపున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

మూడు రాజధానుల ప్రకటన తర్వాత ప్రభుత్వంపై రాజధాని అమరావతి ప్రాంత రైతుల నిరసలు కొనసాగుతునే ఉన్నాయి. అలాగే ఈ మూడు రాజధానుల విషయంలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. CRDA, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను మండలిలో అడ్డుకున్నారు. అయినా కూడా గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతులు కేసు వేయడంతో ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది.



ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఇలా అయితే మూడు రాజధాను ప్రక్రియ ప్రారంభం ఆలస్యం అవుతుందని భావించిన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఇది వారాంతం కాబట్టి ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణకు వస్తుందని భావిస్తోంది ప్రభుత్వం.

కాగా..ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తరలింపు ప్రక్రియను మాత్రం ఆపటంలేదు. విశాఖలో ఆగస్టు 16న రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం కూడా ఊపందుకుంది. అందుకే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని సుప్రీంకు వెళ్లారనే వాదనలు వినబడుతున్నాయి.