AP Lockdown : ఏపీలో మళ్లీ లాక్‌డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో? నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు మళ్లీ విధిస్తారేమో? అనే ప్రశ్నలు ప్రజలను భయపడుతున్నాయి.

AP Lockdown : ఏపీలో మళ్లీ లాక్‌డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Lockdown

AP Lockdown : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య 2 వేల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో? నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు మళ్లీ విధిస్తారేమో? అనే ప్రశ్నలు ప్రజలను భయపడుతున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూ పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అన్న ఆయన.. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నామన్నారు.

కోవిడ్ హాస్పిటళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ సంఖ్య పెంచాలని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని మంత్రి గుర్తు చేశారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం‌, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలని కోరారు. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేదన్నారు. ఏపీ వ్యాప్తంగా 3.80 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్రానికి ఇండెంట్ పంపించామని.. రెండు రోజుల్లో 2 లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసులు కేంద్రం నుంచి రానున్నాయని మంత్రి వెల్లడించారు.

మరోసారి 2వేలకు పైగా కొత్త కేసులు:
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2వేల 558 పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరో ఆరుగురు కోవిడ్ కు బలయ్యారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 31వేల 268 శాంపిల్స్ ను పరీక్షించారు. మరో 915 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,53,33,851 శాంపిల్స్ ను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,15,832. యాక్టివ్ కేసుల సంఖ్య 14,913. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,93,651. మొత్తం మరణాల సంఖ్య 7వేల 268.