మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్, మద్యం ధరలు 25శాతం పెంపు

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 12:13 PM IST
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్, మద్యం ధరలు 25శాతం పెంపు

ఏపీలో మద్యం నియంత్రణ దిశగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల దగ్గర రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రేపటి(మే 4,2020) నుంచి అనుమతి ఉన్న జోన్లలో మద్యం విక్రయాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, వైన్స్ షాపులకు వచ్చే వాళ్లు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

దాదాపు నెల రోజుల లాక్ డౌన్ తర్వాత మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లు మద్యం దొరక్క పిచ్చోళ్లైపోయిన మందుబాబులు మద్యం కొనేందుకు రెడీ అవుతున్నారు. ఇక తమ మద్యం దాహం తీరనుందని ఖుషీ అవుతున్నారు. ఇంతలోనే వారికి ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచింది. అసలే లాక్ డౌన్ కారణంగా ప్రజల ఆదాయం పడిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం ధరలు పెంచడం మందుబాబులకు దిమ్మతిరిగేలా చేసింది. వారిపై మరింత భారం మోపినట్టు అయ్యింది. అయినా పర్లేదు మద్యం తాగి తీరాల్సిందే అనే వారు మాత్రం అదనపు భారం మోయడానికి రెడీ అవుతున్నారు.

అన్ని జోన్లలో మద్యం విక్రయాలు:
లాక్ డౌన్ 2వ దశ ముగుస్తుండటంతో కేంద్రం కొన్ని సడలింపులు చేస్తూ లాక్ డౌన్ 3వ దశకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లు గా విడగొట్టింది కేంద్రం. ఏ జోన్ పరిధిలోకి ఏ జిల్లా వస్తుందో కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కాగా గ్రీన్, ఆరంజ్ జోన్లలో మద్యం విక్రయాలు జరుపుతామన్న కేంద్రం తాజాగా మరో ప్రకటన చేసింది. ఇక రెడ్ జోన్ లోను మద్యం విక్రయించవచ్చని స్పష్టం చేసింది. అయితే రెడ్ జోన్లలో కొన్ని పరిమితులను కూడా విధించింది.

మందు షాపులు, మందుబాబులకు కొత్త నిబంధనలు:
కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాల్స్ లో ఉండే మద్యం రిటైల్ దుకాణాలకు అనుమతి లేదు. దుకాణాల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం కచ్చితంగా పాటించాలంది. మద్యం దుకాణం దగ్గర  ఐదుగురికి మించి ఉండరాదు. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు తెరిచేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. కాగా, జోన్ ఏదైనా బార్లకు మాత్రం పర్మిషన్ లేదు.