లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • Published By: naveen ,Published On : July 21, 2020 / 09:50 AM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్‌ పెంచారు. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ.4 అదనపు సుంకం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ. 4 అదనంగా సుంకం విధించింది.

లాక్ డౌన్ కారణంగా భారీగా తగ్గిన ఆదాయం:
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. 2019 ఏప్రిల్ రూ.4,480 కోట్లుగా ఉన్న ఆదాయం.. 29.5 శాతానికి తగ్గి రూ. 1,323 కోట్లకు పడిపోయిందన్నారు. జూన్ నెలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఉత్తర్వులో తెలిపారు. పడిపోయిన రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవడానికే ధరలు పెంచుతున్నామని భార్గవ్ తెలిపారు. ప్రస్తుత వ్యాట్‌ పెంపు 2015-18 మధ్య వసూలు ప్రకారమే ఉందన్నారు.

రెవెన్యూ పెంచుకోవడానికే:
కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయానికి గండిపడింది. అయినా సీఎం జగన్ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ కారణంగా తగ్గిన ఆదాయం పెంచుకోవడానికి పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను సవరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.