మళ్లీ పాత ఉడా..? : రాజధాని లేనప్పుడు CRDA ఎందుకు

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 11:33 AM IST
మళ్లీ పాత ఉడా..? : రాజధాని లేనప్పుడు CRDA ఎందుకు

అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటుకు కావల్సిన భూమిని సేకరించడానికి, అర్బన్ ప్లానింగ్ అభివృద్ధికి గత ప్రభుత్వం 2014లో ఉడాను రద్దు చేసి, సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాల భూ సమీకరణ ఒప్పందం కుదుర్చుకున్న 21వేల మంది రైతులకు ఏటా కౌలు, రైతు కూలీలకు పింఛన్ల చెల్లింపు, భూముల కేటాయింపు, జోన్ల వారీ అభివృద్ధికి ప్రణాళిక, ఇతర లావాదేవీలు నిర్వహించేందుకు ఇది ఏర్పాటైంది. మున్సిపల్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అధికారులను డెప్యుటేషన్ మీద తీసుకున్నారు. ఉడా పరిధిని పెంచారు. కృష్ణా జిల్లా నందిగామ మొదలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకూ సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నగరంతో పాటు 8,630 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణలో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ వ్యవస్థ ఏర్పడింది.

సీఆర్‌డీఏ అధికారాలు వుడాకు బదలాయింపు:
ప్రస్తుతం రాజధానిని వికేంద్రీకరించే నేపథ్యంలో సీఆర్‌డీఏ పరిధిని కూడా తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. సీఆర్‌డీఏను రద్దు చేసి పాత ఉడా పరిధినే కొనసాగించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందంటున్నారు. దీనికోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్-2020ని ప్రవేశపెట్టాలనే యోచనతో ప్రభుత్వం ఉందట. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఆర్‌డీఏ అధికారాలన్నింటినీ ఉడాకు బదలాయించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రుణాలు, రైతులకు చెల్లింపుల వంటివన్నీ ఉడాకు బదిలీ చేయబోతోంది. సింగపూర్ సంస్థలు అందించిన మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించి అందులో మార్పులు చేర్పులతో జోన్ ప్లానింగ్‌ను ఉడా 15 రోజుల్లో పూర్తి చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

ama

మూడేళ్ల పాటు కౌలు చెల్లింపులు:
సీఆర్‌డీఏను రద్దు చేసినా రాజధానికి భూములిచ్చిన రైతులకు మరో మూడేళ్లపాటు కౌలు చెల్లింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తోందట. ఇవి కాకుండా సీఆర్‌డీఏ విక్రయించిన బాండ్లకు సంబంధించిన చెల్లింపులు కూడా ఉడాకు బదలాయించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. రైతులకు నివాస ప్లాట్ల కింద గత ప్రభుత్వం ఇచ్చిన 200 చదరపు గజాల విస్తీర్ణాన్ని పెంచాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని అంటున్నారు. సీఆర్‌డీఏకు ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారి కమిషర్‌గా ఉంటున్నారు. ఉడాను పునరుద్ధరించడం ద్వారా నామినేటెడ్ పోస్టుకు కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

 

far

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు:
ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే యత్నంలో ఉంది. ఏపీ డిసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్-2020ని తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో బోర్డులో 9మందికి పైగా సభ్యులను నియమిస్తారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఆర్థిక వనరుల అంశాలపై సభ్యులు ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఈ మండళ్లకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.